Karimnagar: కరీంనగర్‌లో ఆగకుండా వర్షం, కలెక్టర్ రివ్యూ - అధికారులకు కీలక ఆదేశాలు
Karimnagar జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ కోరారు.
Karimnagar Rains: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా... శుక్రవారం అర్థరాత్రి నుండి జిల్లాలో ఆగకుండా ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రానున్న పంటలకు నీరు అందుబాటులో ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా 20 వరకు విద్యుత్ స్తంభాలు ఈదురుగాలులకు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో ఐదు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ లతోపాటు రెస్క్యూ టీంలను కూడా సిద్ధం చేశారు. వరుస సెలవులు రావడం కొంత వరకు ప్రజలకు రిలీఫ్ వచ్చింది. రెండో శనివారం, ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసర పనుల్లో బయటకు వచ్చిన వారు ప్రయాణం చేయలేక అవస్థలు పడ్డారు. మొత్తం శనివారం ఉదయం 8 గంటల వరకు 52.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రామడుగులో 64.6 మిల్లీమీటర్ల.. అత్యల్పంగా సైదాపూర్ లో 17.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇక పలు ప్రాంతాలు జలకల సంతరించుకున్నాయి. రాయికల్ మండలంలోని రాయికల్ జలపాతం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పూర్తిగా నీటితో నిండి కోటగిరి గట్ల ద్వారా జెండా గుట్టపై నుండి నీరు జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. పక్కనే ఉన్న చెరువు కూడా నీటితో నిండిపోయి చూపరులను ఆకట్టుకుంటోంది. తిమ్మాపూర్ లోని లోయర్ మానేరు డ్యామ్ లోకి మోయ తుమ్మెద నుండి స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. LMD సామర్థ్యం 24 వేల టీఎంసీలు కాగా శనివారం సాయంత్రం 6 గంటల వరకు 9,397 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,343 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - కలెక్టర్ కర్ణన్
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా వీలైనంత వరకూ ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ఇక లోతట్టు ప్రాంతాలలో నివసించే వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ కోరారు. పాత శిథిలావస్థలో ఇల్లు ఉన్న ప్రజలు వీలైనంత వరకు సురక్షితమైన ప్రాంతాల్లో వర్షాలు తగ్గేవరకు ఉండాలని కోరారు. 24 గంటలు అలర్ట్ గా ఉండాలని వీలైనంత త్వరగా ప్రమాదాలను నివారించే విధంగా సిద్ధపడాలని ఆదేశించారు. వర్షాలతో పంట నష్టం జరిగితే వెంటనే సమీప వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని.. చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.