Karimnagar New Ration Cards: తొలగించడంలో ఉన్న ఉత్సాహం చేర్చడంలో లేదు- కొత్త రేషన్ కార్డులతో తలలు పట్టుకుంటున్న జనం!
Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఇస్తున్న రేషన్ కార్డులు అనేక సమస్యలు తెస్తున్నాయి. పెళ్లైన అమ్మాయిల పేర్లు కార్డుల నుంచి తీసివేస్తున్నా..పేరు నమోదు చేయడం లేదు.
![Karimnagar New Ration Cards: తొలగించడంలో ఉన్న ఉత్సాహం చేర్చడంలో లేదు- కొత్త రేషన్ కార్డులతో తలలు పట్టుకుంటున్న జనం! Karimnagar News People Facing Issues With New ration cards Karimnagar New Ration Cards: తొలగించడంలో ఉన్న ఉత్సాహం చేర్చడంలో లేదు- కొత్త రేషన్ కార్డులతో తలలు పట్టుకుంటున్న జనం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/951132ee50fac7665afedaa9b2f832911669784483546519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karimnagar News: 80వ దశకాల్లో వచ్చిన సినిమాల్లో తరచూ విలన్ కొట్టే డైలాగ్ ఒకటి ఉండేది. ఎక్కువగా మాట్లాడితే నీపేరు ఓటరు లిస్టులో లేకుండా చేస్తా అని.. ఓటర్ లిస్టు మాటేంటో గానీ రేషన్ కార్డుల్లో కొందరి వ్యక్తుల పేర్లు నమోదు కాకపోవడం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. పేదల కుటుంబాలకు రేషన్ పంపిణీ కోసం ఇచ్చిన కార్డులో అవకతవకలు ఇప్పుడు కొత్త చిక్కులను తెస్తున్నాయి. అసలు కార్డులు లేని కుటుంబాలు కొన్ని అయితే కొత్త కార్డులు వచ్చిన ఉపయోగం లేకుండా పోయింది మరికొన్ని కుటుంబాలకు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొన్న విచిత్ర పరిస్థితిపై ఏబీపీ ప్రత్యేక కథనం మీకోసమే...!
రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది. కానీ కుటుంబ సభ్యుల్లో కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారి పేర్లను ఆమోదించడం లేదు. పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టడం లేదు. దాదాపు 7 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీంతో కొత్తగా పెళ్లి చేసుకున్న వారి పేరు కుటుంబ సభ్యుల జాబితాలోకి చేరడం లేదు. వివాహం జరగగానే అమ్మాయి తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యుల నుంచి కుమార్తె పేరు తొలగించి అత్తగారి ఇంట్లో చేర్చుకోవాలని సూచిస్తుండడంతో చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. పేరు తొలగింపునకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం పేరు చేర్చడంలో మాత్రం అవకాశం కల్పించడం లేదు. పిల్లలు పుట్టాక వారి పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చడానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నా వారికి నిరాశ ఎదురవుతుంది.
కొత్త రేషన్ కార్డుల కోసం 41 వేల 643 మంది దరఖాస్తు..
రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని కోరుతూ అధికారుల లెక్కల ప్రకారం 41,643 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇన్స్పెక్టర్ స్థాయిలో 1,376 తహసీల్దార్ స్థాయిలో 997 డీఎస్ఓ స్థాయిలో 12,998 పెండింగ్ లో ఉండగా... 12,980 దరఖాస్తులు అప్రూవ్ చేశారు. 912 దరఖాస్తులను తిరస్కరించారు. కనీసం అప్రూవ్ చేసిన వారి పేర్లను రేషన్ కార్డులు నమోదు చేసిన లబ్ధిదారులకు కొంత ఆర్థికంగా సహాయంగా ఉండేది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు. రేషన్ కార్డు రద్దు చేయడంలో ప్రభుత్వ చురుకుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం 360 డిగ్రీల పేరిట కొత్త సాఫ్టువేర్ ను తీసుకొచ్చింది. దీంతోనే రేషన్ కార్డులు లబ్ధిదారుల సమాచారాన్ని సేకరిస్తుంది. లబ్ధిదారుడికి కారు 5 ఎకరాలపైబడి వ్యవసాయం ఆదాయపు పన్ను తదితర అంశాలను పరిశీలిస్తూ అనర్హులకు ఆటోమేటిక్ గా కార్డు రద్దు చేస్తుంది.
14 వందల కార్డులను తొలగించిన ప్రభుత్వం..
ఇలా జిల్లాలో 1,406 కార్డులు ప్రభుత్వం తొలగించింది. కుటుంబ సభ్యుల్లో ఎవరు చనిపోయినా వారి పేరు వెంటనే తొలగిస్తున్నారు. కానీ పుట్టిన వారి పేర్లను నమోదు చేయడం లేదు. కరీంనగర్ లో ఇలా ఒకరు, ఇద్దరు కాదు జిల్లావ్యాప్తంగా 41,643 మంది రేషన్ కార్డులో పేరు నమోదు.. పేరు మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని తాము బతికున్న కార్డుల పేరు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా న్యాయమైన వారి సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)