Karimnagar MP Candidates: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న? ఉత్కంఠ రేపుతోన్న లోక్‌సభ సీటు
Telangana Elections 2024: కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టిన సీట్లలో కరీంనగర్ ఒకటి. ఈ స్థానం నుంచి తీన్మార్ మల్లన్నను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Karimnagar MP Candidate Teenmar Mallanna: కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలలో దాదాపు ఆయా పార్టీల సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బరిలో దిగుతున్నారు. బీజేపీ నుంచి ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) పోటీ చేస్తున్నారు. దాంతో వీరిని ఢీకొట్టేందుకు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి ఎవరు దిగనున్నారు అన్న విషయం కరీంనగర్‌లో ఉత్కంఠ రేపుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానంలో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిపై ఎటు తేల్చుకోలేకపోతుంది. ఈ క్రమంలో ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు కుమారుడు రాజేందర్ రావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఐతే బీఆర్ఎస్, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) పేరును తెరపైకి చేచింది. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఎక్కువ ఉంటుంది. ఎంపీ టికెట్ వస్తే తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ప్రచార ఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉన్నారని పార్టీలో వినిపిస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీకి ఈ తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి ఎంపీ బండి సంజయ్ కాపు సామాజికవర్గం కావడం అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తీన్మార్ మల్లన్నను బరిలో నిలపాలని హస్తం పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం.
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులుగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు పేర్లు ప్రచారంలో ఉండగా.. కొత్తగా మరొకరి పేరు పార్టీ శ్రేణుల్లో చక్కర్లు కొడుతుంది. క్యూ న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. తీన్మార్ మల్లన్న కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జోరందుకుంది. జర్నలిస్టుగా పలు సంస్థల్లో పనిచేసిన తీన్మార్ మల్లన్న గతంలో నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే.
కాంగ్రెస్ నుంచి చివరగా పొన్నం ప్రభాకర్ 2009లో కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. అంతకుముందు కాంగ్రెస్ నేత 1984, 1989, 1991 లోక్ సభ ఎన్నికల్లో జువ్వాడి చొక్కారావు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను పాతే దిశలో ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయి. అయితే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్, మరోవైపు బిజెపి నుంచి బండి సంజయ్ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే వారి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఢిల్లీకి వెళ్లి మిగతా ఎంపీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చించనున్నారు. మరి తీన్మార్ మల్లన్న కి కాంగ్రెస్ నుండి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి టికెట్ వస్తే పోటీ ఆసక్తికరంగా ఉంటుందని నేతలు చెబుతున్నారు.