Sircilla: జనశక్తి మళ్లీ జీవం పోసుకుంటోందా? ఆ వార్తల లీక్‌తో కలకలం - తెరవెనుక ఏం జరుగుతోందంటే
Naxals Meeting: సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట్, గంభీరావుపేట్, ముస్తాబాద్ కు చెందిన పలువురు మాజీలతో ప్రస్తుతం ఉన్న కొందరు నేతలు సమావేశమైనట్లుగా తెలుస్తోంది.
![Sircilla: జనశక్తి మళ్లీ జీవం పోసుకుంటోందా? ఆ వార్తల లీక్‌తో కలకలం - తెరవెనుక ఏం జరుగుతోందంటే Karimnagar: Janashakti party naxals meeting in Sircilla, SP Rahul Hegde condemns Sircilla: జనశక్తి మళ్లీ జీవం పోసుకుంటోందా? ఆ వార్తల లీక్‌తో కలకలం - తెరవెనుక ఏం జరుగుతోందంటే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/68a1630c7e0e99247704c42896a43a17_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కరీంనగర్ లో తీవ్ర కలకలం రేగింది. ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం నిర్వహించారంటూ వార్తలు లీక్ అవడంతో అటు నిఘా వర్గాలు, ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జనశక్తి సెక్రటరీ విశ్వనాథ్ నేతృత్వంలో సిరిసిల్ల సరిహద్దులో దాదాపు 8 మంది సాయుధులుగా ఉన్నటువంటి నక్సల్స్ మధ్య 65 మంది వరకూ సానుభూతిపరులు సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నెల 12వ తారీకు నుండి 14వ తారీఖు వరకు జరిగిన ఈ సమావేశాల విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది.
సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట్, గంభీరావుపేట్, ముస్తాబాద్ కు చెందిన పలువురు మాజీలతో ప్రస్తుతం ఉన్న కొందరు నేతలు సమావేశమైనట్లు సమాచారం. మరోవైపు, ఈ మీటింగ్ జరగలేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలిపారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. జరిగిన సమావేశాన్ని నిర్ధారించలేదు పైగా ఎవరైనా జనశక్తి పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడినా, బెదిరింపులకు గురి చేసినా తమకు సమాచారం ఇవ్వాలంటూ తెలిపారు. అయితే నిఘా వర్గాలు అప్రమత్తమై తిరిగి పార్టీకి గతంలో యాక్టివ్ గా పనిచేసిన వారి వివరాలు సేకరించడం మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది.
అప్పట్లో చందుర్తి మండలం బండపల్లి, రాజరావుపల్లి, సనుగుల, కిష్టంపేట గ్రామాల్లో సీపీఐ ఎంఎల్ జనశక్తి పేరుతో పలుచోట్ల ఎర్రజెండాలు, వాల్ పోస్టర్లు వెలిశాయి. వాటిని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు అక్కడికి గ్రామానికి చేరుకుని ఎర్రజెండాలు, వాల్ పోస్టర్లను తొలగించారు. మరో వైపు అడపాదడపా పలువురు జనశక్తి సానుభూతి పరులని, నాయకులని పోలీసులు అరెస్ట్ చేసారు.
జనశక్తి గురించి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ప్రభావితం చూపిన జనశక్తి పార్టీని ప్రారంభించింది కూర రాజన్న, అతని సోదరుడు కూర దేవేందర్. రాజన్న అయిన భార్య రంగవల్లి 11 నవంబర్ 1999న ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇక దేవేందర్ భార్య ప్రఖ్యాత విప్లవ గాయని విమలక్క. వేములవాడలోని బోయివాడకు చెందిన కూర రాజయ్య అలియాస్ రాజన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 1974లో నక్సలైట్ ఉద్యమంలో చేరి, ఆ తర్వాత సీపీఐ-ఎంఎల్ (జనశక్తి) రాజన్న వర్గాన్ని స్థాపించారు. 2004 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన శాంతియుత చర్చల్లో రాజన్న సోదరుడు జనశక్తికి ప్రాతినిథ్యం వహించిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి అమర్ అలియాస్ కూర దేవేందర్.
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సల్స్ మీద నిషేధం ఎత్తివేసి చర్చలు జరిపింది. చర్చల సమయంలో జనశక్తి దళకమాండర్ రణధీర్ అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 26 మంది దళ సభ్యులతో లొంగిపోయారు. అలా వరుస దెబ్బలతో కుదేలైన ఆ పార్టీ తిరిగి కదలికలు ఉదృతం చేయడంతో పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)