Karimnagar: విధి వింత నాటకం, అంతుచిక్కని వ్యాధితో ఓ కుటుంబంలో ముగ్గురు మృతి
అంతుచిక్కని జ్వరాలతో డాక్టర్లకు అందని వ్యాధితో ఆ కుటుంబంలోని ముగ్గురు అకాల మరణం చెందడం కరీంనగర్ జిల్లాలోని గంగాధరలో తీవ్ర విషాదం నింపింది.
అదొక అందమైన కుటుంబం... భార్యాభర్తలు ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అల్లరిగా ఇల్లంతా సందడి చేసి పాప.. బాబులతో కలిసి ఆనందంగా జీవిస్తున్న వారిపై విధి పగబట్టింది. అంతుచిక్కని జ్వరాలతో డాక్టర్లకు అందని వ్యాధితో ఆ కుటుంబంలోని ముగ్గురు అకాల మరణం చెందడం కరీంనగర్ జిల్లాలోని గంగాధరలో తీవ్ర విషాదం నింపింది. విషయం తెలిసిన గ్రామస్తులతో పాటు, విషయం తెలిసిన వారు ప్రతి ఒక్కరూ ఎంత ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది?
కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన వేముల శ్రీకాంత్, మమత దంపతులకు సంతానం ఇద్దరు పిల్లలు. 20 నెలల వయసున్న కుమారుడు అద్వైత్ ముందుగా ఒక అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డాడు. దీంతో కలత చెందిన తల్లిదండ్రులు స్థానికంగా ఉండే ఆసుపత్రిలో చికిత్సకు తీసుకెళ్లారు అయితే ఏమాత్రం ఆరోగ్యం బాగుపడక ఆ బాబు నవంబర్ 16 వ తారీఖున చనిపోయాడు. ఆ బాధ కొనసాగుతూ ఉండగానే వారి ఐదేళ్ల పాప అమూల్య కూడా అదే రకమైన వ్యాధి లక్షణాలతో ఆసుపత్రి పాలైంది. లక్షలు ఖర్చుపెట్టిన ఏమాత్రం అనారోగ్యం నుండి కోలుకోలేదు చివరికి నవంబర్ 29వ తారీఖున ఆ పాప సైతం అకాల మరణం చెందింది.
నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లల మరణంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉండగా చివరికి మమత కూడా అదే రకమైన లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అంత బాధలోనూ భర్త శ్రీకాంత్ వెంటనే ఆమెను హైదరాబాదులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాడు. ఒకవైపు లక్షలు ఖర్చు అవుతున్నా ఆమెను బతికించుకోవాలని తీవ్రంగా తపనపడ్డాడు కానీ ఇది మాత్రం దారుణంగా పగ పట్టింది. ఆదివారం అర్ధరాత్రి మమత కూడా కన్ను మూసింది వరుసగా నెల సమయంలో కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఒకరి వెంట ఒకరుగా మృతి చెందడంతో వేముల శ్రీకాంత్ తీవ్రంగా రోదిస్తున్నాడు.
వాంతులు, విరోచనాలతో మొదలైన అంతుచిక్కని వ్యాధి కుటుంబాన్ని కబళించడంతో తన పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా మారింది. పిల్లల కోసం దాదాపుగా 15 లక్షల వరకు వెచ్చించిన ఏ మాత్రం ప్రయోజనం లేకపోగా, తిరిగి పలు సోషల్ మీడియాలో వార్త పత్రికల్లో కథనాలతో కొందరు కనీసం మమతనైనా బ్రతికించడానికి తమ వంతు ఆర్థిక సాయం అందజేశారు. కానీ ఆ భర్త ప్రయత్నం విఫలమై తీవ్రవిషాదానికి గురిచేసింది .శ్రీకాంత్ పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు స్నేహితులు అతడ్ని ఓదార్చలేకపోతున్నారు.
ఎందుకిలా జరుగుతోంది?
గ్రామస్తులు ఆందోళన చెందుతుండడంతో జిల్లాకు చెందిన వైద్యాధికారులు అప్రమత్తమై స్థానిక పీహెచ్సీ నుంచి అధికారులను శ్రీకాంత్ ఇంటిలోని మిగతా కుటుంబ సభ్యుల రక్త నమూనాల కోసం పంపి వివరాలు సేకరించారు. వారి మరణానికి గల కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని తాము కూడా ఇలా ఆకస్మిక మరణాలను చూడలేదని అక్కడి సిబ్బంది అంటున్నారు. మరోవైపు మొదట్లో వాంతులు విరోచనాలతో బాబు చనిపోయినప్పుడే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుని ఉంటే మిగతావారు బ్రతికేవారని గ్రామస్తులంటున్నారు. ఇప్పటికైనా స్పందించి ఈ విషాదానికి గల కారణాలను వెలికి తీస్తే ఈ సమస్యను ఇక్కడితో ముగించవచ్చని వారు కోరుతున్నారు. ఏదేమైనా అంతుచిక్కని వ్యాధితో ఒకే కుటుంబాల్లోని ముగ్గురు చనిపోవడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది.