Huzurabad News: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి Vs ప్రణవ్ బాబు - ఛాలెంజ్‌లు స్వీకరించిన నేతలు, ఇంతలోనే ట్విస్ట్!
Telangana News: చెల్పూరు హనుమాన్ దేవాలయానికి రావాలని హుజూరాబాద్ కీలక నేతలు ఛాలెంజ్‌లు విసురుకున్నారు. సవాళ్లు స్వీకరించగా.. పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఇరువురిని హౌస్ అరెస్టు చేశారు.
Karimnagar News: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్యలో సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయగా.. కౌశిక్ రెడ్డిపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపిస్తానని.. చెల్పూరు హనుమాన్ దేవాలయానికి రావాలని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప్రణవ్ సవాల్ విసిరారు. దీంతో ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు హనుమాన్ దేవాలయానికి వెళ్లనుండడంతో పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఇరువురిని హౌస్ అరెస్టు చేశారు. కానీ, కౌశిక్ రెడ్డి తన ఇంటి వద్ద ఒంటిపై నీళ్లు పోసుకొని తడి బట్టలతో దేవుడిపై ప్రమాణం చేశారు. తాను తన జీవితంలో ఎలాంటి అవినీతి చేయలేదని తేల్చి చెప్పారు.
హుజూరాబాద్ నియోజక వర్గం మీదుగా ఖమ్మంకు ఫ్లై యాష్ అధిక లోడుతో లారీలు వే బిల్లులు లేకుండా వెళుతున్నాయని ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. మంత్రి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయగా ఇది కేవలం పబ్లిసిటీ కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు ప్రణవ్. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కాక ముందు నియోజకవర్గంలో కొంత మంది యువకుల వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని గుర్తుచేశారు.
చెల్ఫూర్ హనుమాన్ ఆలయం వద్ద ఆధారాలతో నిరూపిస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ప్రణవ్ సవాల్ విసిరారు. ఈ సవాలుకు కౌశిక్ రెడ్డి అంగీకరించారు. దీంతో ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు చేల్పూరు ఆలయానికి వస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో ఇరు పార్టీల నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఓవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద.. మరోవైపు ప్రణవ్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.
టీటీడీ ఆలయంలో ప్రమాణం చేయాలన్న కౌశిక్ రెడ్డి
హైదరాబాదులోని టీటీడీ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేయాలన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రామగుండం ఫ్లై యాష్ కుంభకోణంలో తనకెలాంటి సంబంధం లేదని టీటీడీ దేవాలయంలో ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దేవాలయానికి వచ్చే సమయంలో తాను ఒంటరిగా వస్తానని, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చి ప్రమాణం చేయాలన్నారు పాడి కౌశిక్ రెడ్డి.