Godavarikhani: గోదావరిఖనిలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ రెడీ, ఖర్చు రూ.3.5 కోట్లు - ప్రత్యేకత ఏంటంటే
అత్యాధునిక పోలీస్ స్టేషన్ ఎక్కడ లేని విధంగా గోదావరిఖనిలో 3.5 కోట్లతో నిర్మించారు. సింగరేణి సంస్థ ఆ నిధులు కేటాయించడంతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్మాణం చేపట్టింది.
ఏ ప్రాంతంలో అయినా సరే భద్రతా ప్రమాణాలు బాగుంటేనే అక్కడి ప్రజల జీవనం ప్రశాంతంగా ఉంటుంది. మరోవైపు పెట్టుబడులు రావడం ద్వారా సరైన ఉపాధి అవకాశాలు సైతం లభిస్తాయి వీటన్నిటికీ ముఖ్యమైనది శాంతి భద్రతల పర్యవేక్షణని మెరుగ్గా నిర్వహించగలిగే పోలీసింగ్. తెలంగాణ సాకారం అయిన తర్వాత ప్రభుత్వం భద్రత సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల కోసం సకల సౌకర్యాలతో కూడిన స్టేషన్లతో పాటు వాహనాలను సైతం ఏర్పాటు చేసింది. మరోవైపు సీసీటీవీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ ఏ నేరం జరిగినా గంటల్లోనే నిందితులను అరెస్టు చేసే విధంగా టెక్నాలజీని వాడుతోంది. మరోవైపు పోలీసులకు సైతం వారి వారి హోదాలను బట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలను రాబడుతోంది.
రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక పోలీస్ స్టేషన్..
ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే అత్యాధునిక పోలీస్ స్టేషన్ ఎక్కడ లేని విధంగా గోదావరిఖనిలో 3.5 కోట్లతో నిర్మించారు. కోల్ బెల్ట్ ప్రాంతానికి కేంద్రమైన గోదావరిఖని వివిధ రకాల నేరాలకు కేంద్ర బిందువు. రాష్ట్ర స్థాయిలో సంచలనం కలిగించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని హంగులు, సాంకేతికత వసతులను కల్పిస్తూ అత్యాధునికంగా నిర్మించారు.
సింగరేణి సంస్థ 3.5 కోట్లు కేటాయించడంతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి నిర్మాణం చేపట్టారు. నాలుగు సంవత్సరాల క్రితం పనులు మొదలుపెట్టారు. నిర్మాణం పూర్తి కావస్తోంది. ఇందులో పనిచేసే పోలీసు అధికారులు సిబ్బందికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. పనులు పూర్తయిన ఒకటో పోలీస్ స్టేషన్ మంగళవారం హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. పోలీస్ స్టేషన్ తో పాటు, పోలీస్ గెస్ట్ హౌస్, అంతర్గామ్ పోలీస్ స్టేషన్లను డీజీపీ మహేందర్ రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ప్రారంభించనున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల కోసం వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
రిసెప్షన్ కేంద్రంలో ఫిర్యాదు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదు దారులకు ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి సౌకర్యాలను కల్పించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. గోదావరిఖని ఒకటో పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓగా బాధ్యతలు నిర్వహించే అధికారి ఆ గదిలో కూర్చుంటారు. అందులో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఒక్కో ఎస్ఐకి ఒక్కో గదిని కేటాయించారు. దీంతో పాటు రికార్డు గది, పోలీసు అధికారులు సమావేశం కావడానికి హాలును నిర్మించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు గది ఏర్పాటు చేశారు.
డిజిటల్ ప్రొజెక్టర్ కూడా ఉంది. మహిళా సిబ్బంది అధికారులు ప్రత్యేకమైన వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు. సంవత్సరాల నుండి ఉన్న రికార్డులను భద్రపరచడానికి ప్రత్యేకమైన గదిని నిర్మించారు. నేరాలకు పాల్పడే వారిని విచారించేందుకు పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేశారు. దీనివల్ల పారిపోయే అవకాశం లేకుండా నేరస్తులు అధికారుల పర్యవేక్షణలోనే ఉంటారు. పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖని తో పాటు చుట్టుపక్కల జరిగే నేరాలను అదుపులోకి తీసుకురావడంలో పోలీసులకు సకల సౌకర్యాలతో కూడిన ఈ స్టేషన్ ఎంతగానో తోడ్పడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.