Huzurabad: హుజూరాబాద్‌లో పోటీపై కొండా సురేఖ క్లారిటీ.. మరో ట్విస్ట్ కూడా..
బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ తమ అభ్యర్థులుగా బీసీలనే బరిలోకి దించుతున్న నేపథ్యంలో బీసీ వర్గానికే చెందిన కొండా సురేఖ వంటి బలమైన నేతను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖను బరిలో నిలపాలని మెజారిటీ కాంగ్రెస్ నేతలు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్‌లో పోటీపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఓ స్పష్టత ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు తనను పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని వెల్లడించారు. అయితే, ఒకవేళ హుజూరాబాద్‌లో పోటీ చేసినా తాను మళ్లీ వరంగల్‌కే వస్తానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు అలాంటి హామీ ఇస్తేనే హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు ఒప్పుకుంటానని కొండా సురేఖ చెప్పారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ తమ అభ్యర్థులుగా బీసీలనే బరిలోకి దించుతున్న నేపథ్యంలో బీసీ వర్గానికే చెందిన కొండా సురేఖ వంటి బలమైన నేతను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 2018 శాసన సభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్లే వచ్చాయి. వాటిని నిలుపుకొంటే త్రిముఖ పోటీ జరగడం వల్ల రేసులో ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కొండా సురేఖ సామాజికవర్గం పద్మశాలీ. ఆమె భర్త కొండా మురళి సామాజికవర్గం మున్నూరుకాపు. ఈ సామాజికవర్గాలు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలకు తోడు ఇతర బీసీ సామాజికవర్గాల్లోని ఓట్లు కూడా కలిసివస్తే తామే ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.
వరంగల్ జిల్లాలో కీలక నేత అయిన కొండా సురేఖ.. 1995లో మండల పరిషత్‌కు ఎన్నికయ్యారు. 1996లో ఆమె ఏపీ పీసీసీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 1999లో శాయంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లోనూ శాయంపేట శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2009లో కూడా పరకాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆమె మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారీటీ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం ఇవ్వనందున ఆ పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాలంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ మళ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.