CPI Kunamneni: హుస్నాబాద్ నుంచి బరిలోకి చాడ వెంకటరెడ్డి - స్థానిక ఎమ్మెల్యేకు కూనంనేని సవాల్
హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి బరిలోకి దిగుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి బరిలోకి దిగుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. హుస్నాబాద్ లో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు హుస్నాబాద్ లోని అంబేడ్కర్ చౌరస్తా నుండి స్థానిక బస్ డిపో గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి పార్టీ శ్రేణులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తో కలిసి ఆయన భారీ ర్యాలీగా తరలి వెళ్లారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని ప్రచారం చేస్తున్నది ఎవర్రా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రూపాయి ఖర్చు లేకుండా హుస్నాబాద్ లో చాడ వెంకట్ రెడ్డిని పోటీలో ఉంచుతామని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు చాలెంజ్ విసిరారు. రంగులతో అద్దితే తయారైన జెండాలు ఇతర పార్టీల జెండాలని, కానీ కమ్యూనిస్టు నాయకుల రక్తంతో తయారైన జెండా ఎర్రజెండా అన్నారు. తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ లో ఎర్రజెండా ఎగరడం ఖాయమన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్ పేరు పెట్టిన సచివాలయం ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అనుకూలంగా ఉండాలి కానీ రాబందులకు అనుకూలంగా ఉండకూడదన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసి, మోడీపై పోరాడుతున్నామన్న సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని, ముందు దేశంలోని బిజెపి వ్యతిరేక శక్తులను సమైక్యపరిచి, కార్యాచరణను రూపొందించాలన్నారు. మోడీ గడ్డం ఎంత పెరిగిందో, గ్యాస్ ధర అంతా పెరిగిందని, నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. బిజెపి అండతోనే దేశంలో కుబేరులు నల్లదనాన్ని తెల్లదనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
జీఎస్టీలో కార్పొరేట్ వాళ్లకు పన్నుల తగ్గించి, సామాన్యులు వాడే వస్తువులపై పన్నుల శాతాన్ని పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవి అయిన ప్రధాని పదవిలో ఉన్న మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో జై బజరంగబలి అనడం సిగ్గుచేటని, పార్లమెంట్ నుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అన్యాయంగా తరలిస్తే, కర్ణాటకలో ప్రజలు మోడీని తరలించారన్నారు. అత్యాచారం చేసిన వారిని జైలు నుంచి విడిపించి సన్మానిస్తున్నారని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నంబర్ వన్ ఖూనీ కొరు, నేరస్తుడన్నారు. గాంధీని చంపిన గాడ్సే నోటి నుండి వచ్చినవాడు మోడీ అని, మోడీ పాలనలో దేశమంతా ముక్క చెక్కలు అవుతుందన్నారు.
కేవలం కేరళలో ముగ్గురు మహిళలు కనిపించకుండా పోయిన దానిపైన సినిమా తీయించిన మోడీ, 46 వేల మంది గుజరాత్ లో కనబడకుండ పోయారనే విషయంపై ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భూస్వాములకు న్యాయం చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చాడని ఆరోపించారు. మన్ కీ బాత్ లో మోడీ వంద అబద్ధాలు ఆడుతున్నాడని, భారతదేశాన్ని కాపాడుకోవాలంటే మోడీ పోవాల్సిందేనన్నారు. నిజాం పాలన కంటే ఘోరంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉందని ఎద్దేవా చేశారు.