Bandi sanjay: చెరువులో కట్టిన ఒవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదు? ప్రభుత్వానికి బండి సంజయ్ సూటిప్రశ్న
Telangana News | పేదల ఇండ్లను కూల్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులో నిర్మించిన అక్బరుద్దీన్ ఒవైసీ కాలేజీ జోలికి ఎందుకు వెళ్లడంలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.

జగిత్యాల: తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం పేదల ఇండ్లు మాత్రమే కూల్చుతుందని, కాంగ్రెస్, ఎంఐఎం నేతల భవనాల జోలికి వెళ్లడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం నేతలు ఓవైసీ సోదరుల కాలేజీ జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడంపై ఆయన స్పందించారు. జగిత్యాల జిల్లా భీమారం, మేడిపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సలకం చెరువులో నిర్మించిన ఫాతిమా ఒవైసీ కాలేజీ జోలికి పోతే ఎవరికి అన్యాయం జరుగుతుందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ కాలేజీ కూల్చకపోవడం ప్రభుత్వ నిర్ణయమా, లేక హైదరాబాద్ కమిషనర్ సొంత నిర్ణయమా చెప్పాలని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భారీ అవినీతి జరిగినా సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. విచారణ అంటున్నారు తప్పా, అరెస్టులు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు అనేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా ఈ రేస్ కేసు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఫోన్ టాపింగ్ అంశాలపై కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేయకుండా ఎందుకు కాపాడుతున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో, జిహెచ్ఎంసి పరిధిలో పలుచోట్ల పేదల ఇళ్లను కూల్చివేసిన తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా అధికారులు సలకం చెరువులో నిర్మించిన అక్బరుద్దీన్ ఒవైసీ కాలేజీను మాత్రం ఎందుకు టచ్ చేయడం లేదని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చి దాదాపు ఏడాది పూర్తవుతున్న, ఆ కాలేజీని మరోచోటకు ఎందుకు తరలించలేదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
From a possibly agricultural land in 2012 to Fatima Owaisi Women's College in 2024.
— BJP Telangana (@BJP4Telangana) August 26, 2024
Fun fact: Fatima Owaisi is the daughter of AIMIM MLA Akbaruddin Owaisi.
Can HYDRA or Revant Government dare to take any action? pic.twitter.com/I4jG6XwoMp
తెలంగాణ బీఆర్ఎస్, కేటీఆర్ జాగీర్ కాదు..
‘తెలంగాణ రాష్ట్రం అనేది భారత రాష్ట్ర సమితి, కేటీఆర్‌ల జాగీరు కాదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తిరగబడతారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు మీ ఆస్తుల లెక్క ఏంటి. ఇప్పుడు వేల కోట్లతో విదేశాలలో వ్యాపారాలు చేయడం నిజం కాదా?’ అని బండి సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. తాను ఈ మధ్యనే చిన్న ఇల్లు కొన్నానని, ఎవరి ఆస్తులు ఎన్నో ప్రమాణం చేయడానికి రావాలనని కెసిఆర్ కు సవాల్ విసిరారు. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని సూచించారు. బీఆర్ఎస్ నేతలు మీడియా సంస్థలపై దాడులు చేస్తే, వారికి సంబంధించిన ఛానల్ సంస్థలపై దాడి చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.






















