Food Safety: బయట తింటున్న ఫుడ్ సేఫ్ అవునా? కాదా?
Food Safety: బయట తింటున్న ఫుడ్ సేఫ్ అవునా కాదా? అపరిశుభ్రత, కల్తీ లేని ఆహారాన్ని తింటున్నామా?
Food Safety: రోజు రోజుకి మారుతున్న మన ఆహారపు అలవాట్లు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. గతంలో మంచి పేరు సంపాదిస్తే గానీ హోటళ్లకు ఇతర ఆహార సంబంధిత వ్యాపారాలకు గిరాకీ ఉండేది కాదు. వంట చేసే టైం లేక కొందరు, చేయటం రాకపోవటం వల్ల మరింకొందరు చదువు ఉద్యోగం, ఇతరత్రా కారణాల వల్ల బయట దొరికే ఆహారాన్ని తింటున్నారు. దీంతో పెద్ద పెద్ద హోటల్లకే కాకుండా రోడ్ సైడ్ ఉండే చిన్న కొట్లకు, చిన్న చిన్న తినుబండారాల షాపు వాళ్లకు, కూడా ఉపాధి దొరుకుతుంది. దీన్ని అవకాశంగా మార్చుకున్న కొందరు....పరిశుభ్రత పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం ఎంత అవసరమో, తినే పదార్థాలు శుచిగా, శుభ్రంగా ఉండటం కూడా అంతే అవసరం. కానీ కొన్నిచోట్ల పరిశుభ్రతను గాలికొదిలేస్తున్నారు. రోడ్డు పక్కన బండ్లు మాత్రమే కాకుండా పేరున్న పెద్ద హోటళ్లలోనూ శుభ్రత పాటించడం లేదు. ఆహార పదార్థాలలో నాణ్యత దారుణంగా ఉంటుంది. తనిఖీ చేయాల్సిన సంబంధిత అధికారుల బాధ్యతరాహిత్యంగా ఉండటం వల్ల కల్తి చేసేవారికి వరంగా మారింది. కంప్లైంట్ చేయాలనుకునే వారికి అధికారులు అందుబాటులో లేకపోవటం ,...ఫోన్ చేసిన స్పందించకపోవడంతో ఫిర్యాదు చేసేవారు కూడా మనకెందుకులే అన్నట్లుగా ఉంటున్నారు. ఇలా అయితే ప్రజల ప్రాణాలు ఇబ్బందుల్లో పడ్డట్టే.
కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఇలా....
దాదాపు దేశం అంతటా ఇదే పరిస్థితి ఉంది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాను తీసుకుందాం. జిల్లా జనాభా 10 లక్షలు కరీంనగర్ పట్టణంలో 3 లక్షల పైనే ప్రజలు ఉంటారు. జిల్లాలో 2వేలకు పైగా హోటల్లు ,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ హౌస్ లు, చాట్ బండార్, బేకరీలు ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు. అనధికారికంగా ఈ సంఖ్య 5 వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ , ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు , ఒక క్లర్క్, ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. మరొకరు రిటైర్డ్ అయిన అటెండర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. స్టూడెంట్ ఇన్స్పెక్టర్ కూడా పెద్దపల్లి జిల్లా , జగిత్యాల జిల్లాకు ఇన్చార్జి. ఈ నేపథ్యంలో తనిఖీలు పూర్తి చేసిన తరువాత చర్యలు ఎంత పకడ్బందీగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. సిబ్బంది తక్కువగా ఉండడంతో ఏడాదికి ఒకసారి లేదా రెండుసార్లు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లపై తనిఖీలు నిర్వహిస్తూ ఒకటి రెండు కేసులు నమోదు చేస్తున్నారు. ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ లకు పంపించటం వరకే తమ పని అన్నట్లుగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తుంది. దీంతో నగరంలో హోటల్ నిర్వాహకులు ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. కొన్ని హోటళ్ల యజమానులు... కల్తీ ఆహార పదార్థాలు వాడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లాలో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే ఫుడ్ ఇన్స్పెక్టర్ అవసరం ఉంది. గతంలో హోటల్ పెట్టాలంటే కార్పొరేషన్ ఇచ్చే ట్రేడ్ లైసెన్స్ కు తోడు వివిధ రకాల అనుమతులు పొందాల్సి వచ్చేది. మారిన పరిస్థితుల్లో నిబంధనల దృష్ట్యా ట్రేడ్ ఫుడ్ లైసెన్సులు పొందితే చాలు ఫుడ్ సెంటర్లు పెట్టుకుంటున్నారు. కల్తీ నూనెల వంటి వాటిని హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో కొనుగోలు చేసి విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదువులు పోటీ పరీక్షలు ఉద్యోగాలు, వంటి వివిధ కారణాలవల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్న యువతీ యువకులు వీటికి ఆకర్షితులు అవుతున్నారు. సమయం వృధా కాకుండా ఉండడానికి హోటల్లు , మెస్ లతో పాటు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లపై ఆధారపడడంతో నిర్వాహకులు మార్కెట్లో ఉన్న డిమాండ్ ను సొమ్ము చేసుకుంటున్నారు.