Minister Gangula : కరీంనగర్ లో నాలుగు సమీకృత మార్కెట్లు, 3 నెలల్లో అందుబాటులోకి - మంత్రి గంగుల
Minister Gangula : కరీంనగర్ లో నాలుగు సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 3 నెలల్లో ఈ మార్కెట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు.
Minister Gangula : కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. పనుల పురోగతిని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల్లో నగరవ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగు సమీకృత మార్కెట్లను ప్రజలకు అందుబాటులో తేవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమీకృత మార్కెట్ల ఏర్పాటుతో ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు ప్రజలకు అన్ని రకాల మార్కెట్లు ఒకే దగ్గర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. నగరప్రజల సౌకర్యార్థం రూ.40 కోట్లతో నగరానికి నాలుగు వైపులా సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. సమీకృత మార్కెట్ల నిర్మాణంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
పరిశుభ్రమైన వాతావరణంలో
కరీంనగర్ వాసులకు నాణ్యమైన పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు అందించే బల్దియా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం ఒకేచోట అందుబాటులో ఉంచే లక్ష్యంతో నగరం నలుమూలల వీటిని నిర్మిస్తోందని అన్నారు. ఒక్కో దానికి రూ. 10 కోట్ల నిధులతో అత్యాధునిక హక్కులతో నిర్మిస్తుందని తెలిపారు. మార్కెట్ వచ్చే ప్రజలకు సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ సౌకర్యంతో పాటు మంచినీటి వసతులు కలిపిస్తున్నామని అన్నారు. నగరవ్యాప్తంగా రోడ్లమీద 3000 మంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వారందరికీ సమీకృత మార్కెట్లలో అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.
రూ.45 కోట్ల సమీకృత మార్కెట్లు
కరీంనగర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా సరిపడా మార్కెట్లు లేక ప్రధానరోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారని మంత్రి గంగుల తెలిపారు. మాంసాన్ని సైతం అపరిశుభ్రకరమైన వాతావరణంలో అమ్ముతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయన్నారు. రోడ్లపైనే విక్రయాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు నగరంలో రూ.45 కోట్లతో సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు, నేతి రవి వర్మ, నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.