Revanth Reddy : గాలిలో తిరగడం కాదు దమ్ముంటే మోదీ, కేసీఆర్ ప్రజల్లోకి రావాలి- రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణలో భారత్ జోడో యాత్ర 16 రోజుల పాటు విజయవంతంగా కొనసాగిందని రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది. కామారెడ్డి జిల్లా మేనూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి మొదలైన జోడో యాత్ర కృష్ణా నదిని దాటుకుని తెలంగాణలో అడుగు పెట్టిందన్నారు. 10 రోజులుగా లక్షలాది మంది కదం కలుపుతూ తెలంగాణలో యాత్రను విజయవంతం నిర్వహించామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అవసరమైనతే ప్రాణాలు విడిచారు కానీ ఈ మూడు రంగుల జెండాను వదలలేదన్నారు. నాయకుల చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కార్యకర్తల రుణం తీర్చుకోలేమన్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు. శత్రు దుర్బేధ్యమైన అఖండ భారతాన్ని నిర్మించిందన్నారు. బీజేపీ, టీఆరెస్ లు దేశాన్ని విచ్చిన్నం చేసి విద్వేషాలు రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో తెల్ల దొరలను దేశ సరిహద్దులకు తరిమిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు.
అతనొక యోగి...
— Revanth Reddy (@revanth_anumula) November 7, 2022
దేశం కోసం అతనిదొక తపస్సు...
జై బోలో – భారత్ జోడో#ManaTelanganaManaRahul #BharatJodoYatra#Day12 pic.twitter.com/SGGD7WNLjQ
విద్యార్థుల త్యాగాలు మరిచారా?
"తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా తెలంగాణ ఇచ్చారు. నిజాం నిరంకుషానికి వ్యతిరేకంగా నడుం బిగించిన చరిత్ర తెలంగాణ సొంతం. ఏ ఆకాంక్షలతో తెలంగాణ సాధించుకున్నామో అది సిద్ధించలేదు. తెలంగాణ ఉద్యమకారులను నేను ప్రశ్నిస్తున్నా? కేసీఆర్ అరాచక పాలనపై విద్యార్థులు ఎందుకు ఉద్యమించడం లేదు? శ్రీకాంత చారి లాంటి ఎందరో విద్యార్థుల త్యాగాలను మరిచిపోయారా?. ఆ అమర వీరుల పోరాటం గుర్తులేదా?. అమరుల ఆశయాలను నెరవేర్చని ఈ పాలకులను తుద ముట్టించే బాధ్యత మనపై లేదా?. రైతు పండించిన పంటను కొనలేని ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే ఎంత పోతే ఎంత?. ఇలాంటి ప్రభుత్వాలను శంకరగిరి మాన్యాలు పట్టించాల్సిన బాధ్యత రైతులపై లేదా?. తెలంగాణ సర్వ నాశనం అవుతుంటే మేధావులు ఎందుకు కేసీఆర్ కు లొంగిపోయారు. మీరు చెప్పిన మాటలు విని మా పిల్లలు ప్రాణాలు విడిచారు."- రేవంత్ రెడ్డి
గాలిలో తిరగడం కాదు
ప్రధాని మోదీ దేశాన్ని అధః పాతాళానికి తీసుకెళ్లే కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కుట్రకు కేసీఆర్ సహకరిస్తున్నారన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన రాహుల్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందా? అని ప్రశ్నించారు. ఎవరైనా అవినీతి ఆరోపణలు చేస్తే పురుగులు పడి పోతారన్నారు. ఆ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తే ఎడమకాలి చెప్పుతో కొట్టాలన్నారు. రాహుల్ తో జోడో యాత్రలో పాల్గొనడం తన జన్మ ధన్యమైందని రేవంత్ అన్నారు. ఈ క్షణం ఇక్కడే ప్రాణాలు వదిలినా పర్వాలేదన్నారు. గాలిలో తిరగడం కాదు.. దమ్ముంటే మోదీ, కేసీఆర్ ప్రజల్లోకి రావాలని సవాల్ చేశారు.