MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ రెండు సంస్థలు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Kalvakuntla Kavitha News: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో నేడు (మే 20) కవితను తీహార్ జైలు అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తుంది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును న్యాయస్థానం నేడు పరిగణలోకి తీసుకోనుంది. అనంతరం కవితకు, ఇతర నిందితులకు చార్జిషీట్ కాపీ అందించే అవకాశం ఉంది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది. కవితను నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ రెండు సంస్థలు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం కవిత ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
మార్చి 16న కవితను ట్రయల్ కోర్టులో కవితను హాజరుపర్చగా.. ఈడీ వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి రూ.వంద కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. రెండు దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అనంతరం మార్చి 26న కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత ఆమెను తిరిగి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు సీబీఐ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ మే 20తో ముగియనుంది.
అయితే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వంటి ఆప్ కీలక నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన రూ.100 కోట్ల ముడుపులలో కవిత జోక్యం ఉన్నట్లుగా ఈడీ చెబుతోంది. 2021-22 ఏడాదిలో మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని.. అనంతరం హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.