Laxman for Rajya Sabha: తెలంగాణ బీజేపీ నేత కె. లక్ష్మణ్‌కు బంపరాఫర్, అక్కడి నుంచి రాజ్యసభకు వెళ్లనున్న ఓబీసీ నేత
BJP nominates Laxman for Rajya Sabha: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్‌కు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓబీసీ నేతను ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పెద్దల సభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.
దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల జోరు పెరిగింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు రాజ్యసభకు తమ అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాలు విడుదల చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్‌కు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓబీసీ నేత లక్ష్మణ్ ను (Dr K. Laxman) ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పెద్దల సభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. మరోనేత మిథిలేష్ కుమార్‌ను సైతం యూపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ ఫిక్స్ అయింది. ఈ మేరకు పలు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
యూపీ నుంచి రాజ్యసభకు లక్ష్మణ్..
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను యూపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బార్ నఖ్వీకి నిరాశే ఎదురైంది. ఆ సీటు తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్‌కు లభించింది. సోమవారం రాత్రి బీజేపీ విడుదల చేసిన నలుగురు రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో లక్ష్మణ్ ఉన్నారు. మొత్తం నలుగురు అభ్యర్థులలో మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సిరోయ, యూపీ నుంచి డా కె. లక్ష్మణ్, మిథిలేష్ కుమార్‌లను రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
నేడు నామినేషన్ వేయనున్న లక్ష్మణ్
యూపీ నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా డా. లక్ష్మణ్ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇదివరకే లక్నోకు వెళ్లినట్లు సమాచారం. పార్టీకి సేవ చేసే వ్యక్తిని రాజ్యసభకు పంపి గౌరవించాలని బీజేపీ ప్లాన్ చేసింది. 2016 నుంచి 2020 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి సేవలు అందించారు. 1999, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ నేత లక్ష్మణ్ ఎన్నికయ్యారు.
దేశవ్యాప్తంగా 57 స్థానాలకు పోలింగ్
దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 57 మంది రాజ్యసభ ఎంపీ పదవీకాలం జూన్ 21 నుంచి ఆగస్టు 1వ తేదీలోగా ముగియనుంది. వీటిలో అత్యధికంగా యూపీ నుంచి 11 స్థానాలకు, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి 6 స్థానాల సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఏపీ నుంచి 4 స్థానాలు, తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. పదవీకాలం పూర్తయ్యేవారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, కపిల్ సిబల్, అంబికా సోని తదితర నేతల పదవీకాలం త్వరలో పూర్తికానుంది. ఏపీ నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎంపీలు టీజీ వెంకటేష్, వై సుజనా చౌదరి, సురేష్ ప్రభు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒడిశా నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న నెక్కంటి భాస్కర్‌రావు పదవీకాలం సైతం జులై 1వ తేదీన ముగియనుంది.
తెలంగాణ సీనియర్లలో ఆశలు !
బీజేపీ సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్, జితేందర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో గరికపాటి మోహన్ రావు బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆయన పలువురు టీడీపీ నేతల్ని బీజేపీలో చేర్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఇతర రాష్ట్రాల నుంచైనా రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలను అంచనా వేసుకొనే అభ్యర్థిని నిర్ణయించనున్నారని తెలుస్తోంది.
Also Read: Etela Rajender: కేసీఆర్‌పై ఈటల ఘాటు వ్యాఖ్యలు- కేసీఆర్ తెలంగాణలో తిరగలేరంటూ కామెంట్స్