KK Resigns from Rajya Sabha : రాజ్యసభకు కేకే రాజీనామా - మళ్లీ కాంగ్రెస్ నుంచి చాన్స్ ఇస్తారనే హామీ వచ్చిందా ?
Telangana Congress : రాజ్యసభకు కే కేశవరావు రాజీనామా చేశారు. ఉపఎన్నిక వస్తే మళ్లీ కాంగ్రెస్ నుంచి ఆయనకు చాన్స్ ఇచ్చే ఒప్పందం మీద రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
K Kesha Rao resigned from Rajya Sabha : గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ తరపున ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీ మారినందున ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హతా వేటు పడే అవకాశం ఉంది. అందుకే ఆయన ముందుగానే రాజీనామా చేశారు. ఇంకా ఆయనకు రెండేళ్ల వరకూ పదవి కాలం ఉంది. రాజ్యసభ చైర్మన్ కేకే రాజీనామాను ఆమోదించి నోటిఫై చేస్తే ఎన్నికల సంఘం ఉపఎన్నికలు నిర్వహిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకే ఆ స్థానం దక్కుతుంది. అందుకే ఉపఎన్నికలు వచ్చినా తన మిగిలిన పదవీ కాలం మేరకు తనకే రాజ్యసభ సీటు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని కేకే పార్టీ మారినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలోనే కాంగ్రెస్‌లో చేరిన కేకే కుమార్తె మేయర్ గద్వాల విజయలక్ష్మి
కేకే కుమార్తె , హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. కేకే కుమారుడు విప్లవ్ బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు. కేకే స్వతహాగా కాంగ్రెస్ నేత. ఆయన పీసీసీ చీఫ్ గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సారే గెలిచారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆయనకు పదవులు మాత్రం వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత ... తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోవడం.. కాంగ్రెస్ బలహీనపడటంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు మంచి పదవి ఇచ్చి.. కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోగానే ఆయన పార్టీ మారిపోయారు.
అనర్హతా వేటు పడే అవకాశం ఉండంతో రాజీనామా
కేకే పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాత ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లోని కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. గత మార్చిలో ఈ ఆహ్వానం ఇచ్చారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉండంతో చేరిక ఆగిపయోయింది. ఆయన కుమార్తె మాత్రం కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో అధికారికంగా చేరకపోవడంతో సమస్య అయింది. ఇప్పుడు ఎమ్మెల్యేల బలం కూడా ఉన్నందున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే ఉపఎన్నికల్లో మరోసారి పదవి పొందవచ్చన్న నమ్మకంతో రాజీనామా చేశారు.
బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నేతలు కూడా చేరుతున్నారు