Jangaon Politics: జనగామ బీఆర్ఎస్ లో ఆసక్తికర పరిణామం, ముత్తిరెడ్డి కాళ్లకు నమస్కరించిన పల్లా
Jangaon Politics: జనగామ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి... ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాళ్లకు నమస్కరించారు.
జనగామ: తెలంగాణలో నిన్నమొన్నటి వరకు హాట్ టాపిక్ గా ఉన్న సీట్లలో జనగామ నియోజకవర్గం ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy)ని కాదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. అయితే తనకే టికెట్ ఇవ్వాలని ముత్తిరెడ్డి ఒత్తి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ (TSRTC Chairman) పదవి ఇవ్వగా బాధ్యతలు స్వీకరించారు. అయినా అసంతృప్తిగా ఉండటంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో నేడు జనగామ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
జనగామలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకే వేదిక మీద కనిపించారు. నియోజకవర్గం కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. తమ మధ్య విభేదాలు లేవని చూపిస్తూ.. ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు. పల్లాకు సహకరించాలని కార్యకర్తలకు ముత్తిరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి... ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాళ్లకు నమస్కరించారు.
పల్లా చెయ్యిని పైకెత్తి మనం కలిసికట్టుగా ఉండాలన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తమ మధ్య విభేదాలు లేవని, పరిస్థితి మారిపోయిందని మంత్రి హరీష్ రావు సమక్షంలో సంకేతాలిచ్చారు. జనగామ టికెట్ దక్కించుకున్న పల్లా రాజేశ్వరెడ్డికి సహకరించేందుకు ముత్తిరెడ్డి సిద్ధమయ్యారు. పల్లాకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. కేటీఆర్ రంగంలోకి దిగిన తరువాత జనగామలో పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిరింది.
జనగామ టికెట్ పంచాయతీకి ముగింపు
జనగామ బీఆర్ఎస్ టికెట్పై మంగళవారం ఉత్కంఠ వీడింది. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ముత్తిరెడ్డి, పల్లా మధ్య సయోధ్య కుదిరింది. జనగామ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు. జనగామ టికెట్ ఆశావాహి మండల శ్రీరాములు, మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ ను కూడా పిలిపించి భవిష్యత్ లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ముత్తిరెడ్డి కొంచెం వెనక్కి తగ్గినట్లు కనిపించారు.
బీఆర్ఎస్ తొలి జాబితాలో చోటు దక్కని నియోజకవర్గాల్లో జనగామ కూడా ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మరోసారి టికెట్ ఖరారు కాకపోవడంతో ఆయన అలకబూనారు. అయితే అవకాశం ఎక్కడికీ పోలేదని అనుచరులకు సర్దిచెబుతూ వచ్చారు. తీరా ఆయన్ను ఆర్టీసీ చైర్మన్ గా నియమించే సరికి జనగాన ఎమ్మెల్యే టికెట్ రాదని క్లారిటీ వచ్చేసింది. అయినా కూడా తానే బరిలో ఉంటానంటూ చెబుతున్నారు ముత్తిరెడ్డి. చివరకు ఈ పంచాయితీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ముత్తిరెడ్డితోపాటు, జనగామ టికెట్ ఆశిస్తున్న మండల శ్రీరాములు, కిరణ్ కుమార్ గౌడ్ ని కూడా పిలిపించి మాట్లాడారు కేటీఆర్. ఈసారి టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు.