Jagtial News : జైలులో ఉన్న బాధితుడు, వీడియో కాల్ లో విచారించి పరిష్కరించిన జడ్జి
Jagtial News : జైలులో ఉన్న వ్యక్తితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి కొడుకు యాక్సిడెంట్ కేసును పరిష్కరించారు జగిత్యాల జిల్లా జడ్జి.
Jagtial News : ఓ యాక్సిడెంట్ ను కేసు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించారు జిల్లా జడ్జి. ధర్మపురి పట్టణంలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసును జడ్జి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించిన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. ధర్మపురికి చెందిన శ్యామ్ రావు హరీష్ కవితల పెద్ద కుమారుడు 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటనలో ట్రక్కు యజమానులపై కేసు నమోదు కావడంతో వీరి తరపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే చివరికి పరిష్కారం అయ్యే దశకు చేరుకున్న సమయంలో శ్యామ్ రావు హరీష్ అరెస్టు అయ్యారు. అతడు చంద్రపూర్ లోని జైల్లో ఉన్నారు. దీంతో లీగల్ సర్వీస్ ఛైర్మన్, జిల్లా జడ్జి నీలిమ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యను పరిష్కరించారు. పిటిషనర్ల కోరిక మేరకు పరిహారం చెల్లించి లోకదాలత్ లో కేసుని ముగించినట్లు న్యాయవాది గుండి రాములు తెలిపారు.
చేయని నేరానికి 14 ఏళ్ల జైలు జీవితం
చేయని నేరానికి 14 ఏళ్లు జైలు జీవితం గడిపాడు తెలంగాణ యువకుడు. ఓ వ్యక్తి మృతి కేసులో అరెస్టుగా దుబాయ్ కోర్టు యువకుడికి మరణశిక్ష విధించింది. మృతుని కుటుంబం క్షమాభిక్షకు ఒప్పుకోవడంతో యువకుడిని జైలు నుంచి రిలీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలానికి చెందిన మాకురి శంకర్ 2006లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిలో చేరాడు. శంకర్ దుబాయ్‌కు వెళ్లే సమయంలో అతడి భార్య గర్భిణీ. కొన్ని రోజుల తర్వాత కుమారుడు జన్మించాడు. 2009లో శంకర్ స్వగ్రామానికి తిరిగి రావాల్సి ఉన్నా అనుకోని ఘటన అతని జీవితాన్ని మార్చేసింది. శంకర్ పనిచేస్తున్న కంపెనీలో ఓ వ్యక్తి ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన దుబాయ్ పోలీసులు ఆ వ్యక్తి మరణించడానికి శంకర్ కారణమని అరెస్టు చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అతడు ప్రమాదవశాత్తు జారిపడిపోయాడని శంకర్ ఎంతగా ప్రాధేయపడినా స్థానిక కోర్టు ఒప్పుకోలేదు. ఈ కేసులో విచారించిన దుబాయ్ కోర్టు 2013లో శంకర్‌కు మరణశిక్ష విధించింది. మరణశిక్షపై పునఃపరిశీలన చేయాలని శంకర్ కోర్టును అప్పీలు చేయగా తిరిగి విచారణ ప్రారంభం అయింది.
క్షమాభిక్షతో స్వదేశానికి
అయితే శంకర్ కు కోర్టు ఒక అవకాశం ఇచ్చింది. మరణశిక్ష కొట్టివేయాలంటే మృతుని కుటుంబం నుంచి క్షమాభిక్ష అనుమతి తీసుకురావాలని కోర్టు సూచించారు. దీంతో శంకర్ కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ నేత దేగాం యాదాగౌడ్‌ను కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఆయన దుబాయ్‌లోని న్యాయవాదిని కాంటాక్ట్ చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయింది రాజస్థాన్ యువకుడు అని తెలుసుకున్న శంకర్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి, రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో మృతుని కుటంబ సభ్యులు క్షమాభిక్షకు ఒప్పుకున్నారు. అయితే ఆ పరిహారాన్ని శంకర్ కుటుంబ సభ్యులు విరాళాల రూపంలో వసూలు చేసి మృతుని కుుటుంబానికి అందించారు. దీంతో బాధిత యువకుడి కుటుంబం క్షమాభిక్ష పత్రాలపై సంతకం చేయటంతో వాటిని దుబాయ్ కోర్టుకు సమర్పించారు. దీంతో అక్కడి కోర్టు శంకర్‌కు మరణశిక్ష నుంచి విముక్తి కల్పించింది. వారం రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన శంకర్ స్వగ్రామం చేరుకున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత శంకర్ ఇంటికి చేరుకున్నాడు.