(Source: ECI/ABP News/ABP Majha)
It Raids: కాంగ్రెస్ నేతలపై ఐటీ నజర్ - నిన్న కేఎల్ఆర్, నేడు జానారెడ్డి, కీలక పత్రాలు, నగదు స్వాధీనం
It Raids: తెలంగాణలో కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా, మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్పర్ వ్యాలీ విల్లాస్ లో తనిఖీలు జరుగుతుండగా, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మొత్తం 18 చోట్ల కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కాగా, గురువారం ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), బడంగ్ పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. లక్ష్మారెడ్డి ఫామ్‌హౌస్, ఇతర నేతల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగాయి. కాగా, కాంగ్రెస్ నేత కె.లక్ష్మారెడ్డి మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నారు.
కీలక పత్రాలు స్వాధీనం
లక్ష్మారెడ్డి, పారిజాత ఇళ్లల్లో శుక్రవారం ఉదయం వరకూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఇరువురి నేతల ఇళ్లల్లో పలు కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ నెల 6న ఐటీ కార్యాలయంలో హాజరు కావాలని కేఎల్ఆర్, పారిజాతలకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే, గురువారం వేకువజామున ఆరుగురు సభ్యుల బృందం ఇరువురి నేతల ఇళ్లపైనా దాడులు చేసింది. ఆ సమయంలో పారిజాత తిరుపతిలో ఉన్నారు. వెంటనే రమ్మని చెప్పి, అందరి ఫోన్లు స్వాధీనం చేసుకుని తనిఖీలు ప్రారంభించారు. సాయంత్రానికి నరసింహారెడ్డి ఇంటికి చేరుకున్నారు. సోదాల విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని నిలువరించారు. అలాగే, కోకాపేటలోని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత బంధువు ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఈసీకి వచ్చిన నిర్దిష్ట సమాచారం ఆధారంగానే ఐటీ సోదాలు జరిగాయని తెలుస్తోంది.
'రైడ్స్ కుట్రలో భాగమే'
ఐటీ రైడ్స్ రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.వేల కోట్లు సంపాదించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరగలేదని, మేయర్ అయిన తన ఇంటిపై దాడులు చేయిస్తారా.? అంటూ నిలదీశారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. సబితా ఇంద్రరెడ్డి ఓడిపోతుందని సర్వేలు చెప్పాయని, ఆమెకు ఓటమి భయం పట్టుకుందని మండిపడ్డారు. అధికార పార్టీల నేతలపై కాకుండా తమపై ఐడీ దాడులు చేయడం, ఇబ్బంది పెట్టాలనే కుట్రేనని, బీఆర్ఎస్ కక్ష పూరిత రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. కాగా, సోదాల సమయంలో తిరుపతిలో ఉన్న ఆమెను ఐటీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు.
రేవంత్ రెడ్డి విమర్శలు
కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ సోదాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిదనేరళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల నుంచి కేసీఆర్ ను బీజేపీ పెద్దలే కాపాడుతున్నారని ఆరోపించారు. ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఐటీ సోదాలపై ధ్వజమెత్తారు. కాగా, ఐటీ సోదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: 'వారం రోజుల్లో నేనే మీ ముందుకు వస్తా' - ఆస్పత్రి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి వీడియో సందేశం