Congress Internal Fight : వికటిస్తున్న రేవంత్ ఆకర్ష్ - సీనియర్లను అవమానిస్తున్నారా ?
Revanth Reddy : కాంగ్రెస్‌లో చేరికలు వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లో తమకు కనీస సమాచారం లేకుండా ప్రత్యర్థుల్ని పార్టీలో చేర్చుకోవడంపై అసహనం వ్యక్తమవుతోంది.
Is Revanth is insulting the seniors : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారో.. భారత రాష్ట్ర సమితిని బలహీనం చేయాలనుకుంటున్నారో కానీ పీసీసీ చీఫ్ కమ్ సీఎం రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వెళ్తున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు సైలెంట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరు పడిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల సంజయ్ కుమార్‌లకు మూడో కంటికి తెలియకుండా కండువా కప్పేశారు. వారు పార్టీలో చేరిన తర్వాతే విషయం బయటకు తెలిసింది. ఇది బీఆర్ఎస్ నేతలకే కాదు కాంగ్రెస్ నేతలకు కూడా షాక్‌గా మారింది.
ఇప్పటి వరకూ తాము ఎవరిపై పోరాడామో వారిని తీసుకొచ్చి రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ నేతలుగా మార్చేస్తే.. తామేం చేయాలని ఆయా నియోజకవర్గాల క్యాడర్లు మథనపడుతున్నారు. పదేళ్లుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పోరాడానని తనకు తెలియకుండా ఆయనను పార్టీలో చేర్చుకోవడం ఏమిటని తాటిపర్తి జీవన్ రెడ్డి ఫీలయ్యారు. నిజానికి ఆయన లాంటి సీనియర్ ఉన్న నియోజకవర్గంలో ఎవరినైనా చేర్చుకునేటప్పుడు రాష్ట్ర పార్టీ నాయకత్వం ముందుగా ఆయనకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆయనకు కనీస సమాచారం లేకుండా.. మీడియాలో వచ్చిన తర్వాతే ఆయన తెలుసుకోవాల్సి వచ్చింది. సహజంగానే ఇది ఆయనను అవమానించినట్లు అవుతుంది. అందుకే బహిరంగంగా అసంతృప్తిని తెలిపారు. ఇక తనకు రాజకీయం వద్దని వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు.
నిజానికి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతు దారు. పీసీసీ చీఫ్ ఎంపిక సమయంలో సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రతినిధి బృందానికి చాలా మంది రేవంత్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా జీవన్ రెడ్డి మత్రం మద్దతుగా మాట్లాడారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇస్తే పార్టీ బలపడుతుందని చెప్పారు. తన సీనియార్టీని గుర్తించి ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న తనకు మంత్రి పదవి ఇస్తారని ఆయన అనుకున్నారు. ఎంపీగా పోటీ చేయమన్నా చేశారు. అయితే ఇప్పుడు హటాత్తుగా తన నియోజకవర్గంలోనే తనకు ఎర్త్ పెట్టడంతో ఆయన అవమానానికి గురయ్యానని ఫీలవుతున్నారు.
ఈ ఒక్క చేరికల విషయంలోనే కాదు.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పలువురు బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పరాజయం పాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేవారంతా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నించిన వారే. ఇప్పుడు వారిని చేర్చుకుని కాంగ్రె్స గెలుపు కోసం పని చేసిన వారిని తక్కువ చేయడం ఎందుకన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం దూకుడుగా ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తు్న్నారు.