Telangana Cabinet: మరోసారి ఢిల్లీకి రేవంత్ - ఈ సారి కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఖాయమే !?
ఆరుగురు కొత్త అమాత్యులు ఎవరో ఇక తెలనుంది. ఇందు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండి మంత్ర వర్గ విస్తరణపై మంతనాలుజరపనున్నారు
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ మకాం వేయనున్నారు. రాజస్థాన్ లో ఓ వివాహవేడుకకు హజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం. రేపు, ఎళ్లుండి అక్కడే ఉండి క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశాలున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈలోపే కొత్త క్యాబినెట్ కొలువు తీరవచ్చన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయో ఆ అంశాలపై పూర్తి క్లారిటీతో సీఎం రేవంత్ రెడ్డి ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని గాంధీ భవన్ లోని సీనియర్ కాంగ్రెస్ మెన్ చెబుతున్నారు.
మంత్రి వర్గ విస్తరణకు వేళయిందా..?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తోంది. 2023 డిసెంబర్ 7 న రేవంత్ సీఎంగా మరో 11 మంది మంత్రులతో రేవంత్ సర్కార్ నడుస్తోంది. శాసన సభ లో సభ్యుల సంఖ్యను బట్టి క్యాబినెట్ లో మరో ఆరుగురికి మంత్రి పదవుల ఇవ్వాల్సి ఉంది. కొత్త మంత్రివర్గం ఏర్పడినప్పుడే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. కాని వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత శావ్రణ మాసం కావడంతో మంచి రోజులు లేవని అప్పుడు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ సారి క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని ఇదే విషయమై హై కమాండ్ తో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు చక్కర్లు కొట్టాయే తప్ప ఈ దిశగా చర్చే జరగలేదని ఢిల్లీ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది పాటు హోం మంత్రి వంటి కీలక శాఖలకు మంత్రి లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితిలో ఇప్పటికే ఒక ఏడాది పూర్తయింది. మరో నాలుగేళ్లు మాత్రమే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగనున్న నేపధ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఏడాది పాలన పూర్తి కావడం, డిసెంబర్ 9వ తేదీ వరకు పాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, తెలంగాణ జాతీయ గీతం ఆమోదం వంటి కీలక అంశాలు పూర్తి కావడంతో ఇక మంత్రి వర్గ విస్తరణ ఉండనుందన్న వార్తలు గాంధీ భవన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ సహా హైకమాండ్ ముఖ్య నేతలను కాకా పట్టే పనిలో ఉన్నారు.
ఆరుగురు అమాత్యులు ఎవరు..?
రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో 11 మంది మంత్రులు ఉండగా ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే, ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. అందులో ఉప ముఖ్యమంత్రి గా సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క , మంత్రులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావులకు అవకాశం దక్కింది. నల్గొండ నుండి కొమటి రెడ్డి వెకంటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుండి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా నుండి సీతక్క, కొండా సురేఖ, మహబూబ్ నగర్ జిల్లా నుండి జూపల్లి కృష్ణారావు, మెదక్ జిల్లా నుండి దామోదర రాజనర్సింహలు ఉన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు. ఇప్పుడు ఈ జిల్లా సమీకరణాలను బట్టి మంత్రి వర్గం ఎలా ఉండనుందన్న చర్చ సాగుతోంది. ఆరు క్యాబినెట్ స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్ ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఇక నిజామాబాద్ నుంచి పి. సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు లు పోటీ పడుతున్నారు. అయితే సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాలనుండి ఎవర్ని ఎంపిక చేస్తారన్న చర్చ సాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మలా రెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. హైదరాబాద్ నుండి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే ఉపఎన్నికలో కంటోన్మెంట్ నుండి గెలిచారు. అయితే రంగారెడ్డి జిల్లా కోటాలో
అయితే మల్ రెడ్డి రంగారెడ్డి, హైదరాగా బాద్ నుండి పార్టీ మారిన దానం నాగేందర్, హైదరాబాద్ నుండి మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్, అజారుద్ధీన్ లు పోటీ పడతున్నారు. అయితే ఇదే మైనార్టీ కోటా నుండి మా జీ మంత్రి షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కునందా అన్న ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. అయితే మహబుబ్ నగర్ నుండి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు క్యాబినెట్ లో ఉండగా మక్తల్ నుండి ఎన్నికయిన వాకిటి శ్రీహరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది. ముదిరాజ్ లకు క్యాబినెట్ లో అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హమీ మేరకు శ్రీహరికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. నల్గొండ జిల్లా నుండి ఇద్దరు మంత్రులు ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉండగా, తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోమటి రెడ్డి రాజ్ గోపాల్ అదిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. అదే జిల్లా నుండి ఇతర సామాజిక వర్గాలకు చెందిన బాలు నాయక్, బీర్ల ఐలయ్య కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
ఢిల్లీలో హైకమాండ్ ఏం చేస్తుందో...?
మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే హైకమాండ్ దగ్గర ఇప్పటికే పలువురు తెలంగాణ సీనియర్ నేతలు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని పైరవీలు చేస్తోన్న నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాను హైకమాండ్ ఓకే చెప్తుందా లేదా ఒకరిద్దరిని మారుస్తూ కొత్త జాబితా ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. అదే రీతిలో పార్టీ మారిన దానం, వరంగల్ జిల్లా నుండి కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలు తమకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నైపధ్యంలో బీఆర్ఎస్ వీడి పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి కట్టబెడతారా లేదా అన్నది చూడాలి. అంతే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రులను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని , అలా చేరిన మాజీలకు తిరిగి మంత్రి పదవి ఇవ్వాలన్న చర్చ సాగుతోంది. అయితే ఇందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. అంతే కాకుండా ఆరు మంత్రి పదవులను భర్తీ చేస్తారా లేక ఒకటి రెండు మంత్రి పదవులను భర్తీ చేయకుండా అట్టిపెట్టి ఉంచుతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పార్టీలో సీనియర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మంత్రి పదవులు దక్కని వారు పార్టీ లైన్ దాటి పని చేయకూడదంటే అలా ఒకటి రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉంచడం ద్వారా వారిని అదుపుచేయవచ్చ అన్న ఆలోచనలోను హైకమాండ్ ఉండవచ్చని గాంధీ భవన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతే కాకుండా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలంటే బీఆర్ఎస్ నుండి వచ్చే సీనియర్లకు ఆ మంత్రి పదవులను గాలం వేసి లాగవచ్చన్న వ్యూహం కూడా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వారంలో ఈ సస్పెన్స్ కు ఇక తెరపడుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ రెండు మూడు రోజుల్లో మాత్రం కొత్త క్యాబినెట్ కొలువు తీరే అవకాశం ఉందని, మంత్రులతో పాటు పాత మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉందని హస్తం నేతలు చెబుతున్నారు.