Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?
రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో భిన్నమైన పంచాంగాలను పండితులు వినిపించారు.
Political Panchamgam : ఉగాది పంచాంగాల్లో పండితులు ఒకటే చెప్పరు. రాజకీయ పార్టీల ఉగాధి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు పండితులు ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా పంచాంగ శ్రవణం వినిపిస్తూంటారు. ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపించింది. ఏ పార్టీ ఆఫీసులో ఎలాంటి పంచాంగం చెప్పారో ఓ సారి చూద్దాం.
ఏపీ సీఎంకు వ్యక్తిగతంగా, పాలనా పరంగా కలసి వస్తుందని చెప్పిన సుబ్బరాయ సోమయాజులు
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకల్లో కప్పగంతు సుబ్బరాయ సోమయాజులు పంచాంగ శ్రవణం వినిపించారు. శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని కప్పగంతు సుబ్బరాయ సోమయాజులు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు పండించే రైతులకు ఈ ఏడాది మంచి లాభాలు వస్తాయన్నారు. పాడి రైతులకు ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. వ్యవసాయం ,ఆర్థిక, విద్యాశాఖల్లో మంచి అభివృద్ది ఉంటుందన్నారు. సీఎంకు వ్యక్తిగతంగా, పాలనా పరంగా కలసి వస్తుందని అన్నారు. ఈ ఏడాదిలో విశేష ఫలితాలు వస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటుందని సోమయాజులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు.
తెలంగాణ ప్రభుత్వానికి కోర్టుల్లో అనుకూల తీర్పులు వస్తాయన్న బాచంపల్లి సంతోష్‌కుమార్
తెలంగాణ ప్రభుత్వం తరపున శారదాపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగం శ్రవణం పఠించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. పెండింగ్ బిల్లులన్నింటికి క్లియరెన్స్ ఈ ఏడాది రాబోతోందన్నారు. కొంతమంది వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు వస్తాయని... పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది నిండబోతున్నాయన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యా శాఖలో కొన్ని అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థ ఈ ఏడాది మంచి తీర్పులు ఇవ్వబోతోందని... సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వబోతున్నాయని సంతోష్‌కుమార్ వెల్లడించారు. కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర భారతంలో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయని వెల్లడించారు. ఈ మూడు మాసాల్లో విపరీతమైన ఒడిదుడుకులు జరగబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆసక్తికరమైన రాజకీయాలను చూడబోతున్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డి వెంట నడవాలని సూచించిన చిలుకూరు శ్రీనివాసమూర్తి
గాంధీభవన్ లో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో చిలుకూరు శ్రీనివాసమూర్తి పంచాంగాన్ని పఠించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన పెరుగుతుందని ఆయన తెలిపారు. సరిహద్దు వివాదాలు పెరుగుతాయని.. నదులు పొంగి ప్రవహిస్తాయన్నారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో నష్టం జరుగుతుందని తెలిపారు. నూతన రాజకీయ కూటములు ఏర్పడుతాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అల్లర్లు ప్రజలను ఇబ్బంది పెడతాయన్నారు. గంగానది పుష్కరాలు ఏప్రిల్ 23 నుంచి మొదలుకానున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి )కి అందరూ సహకరించాలని... అందరూ ఆయన వెంట నడవాలని సూచించారు.