Governor Tamilisai: నాకు అవమానం జరిగినా పర్లేదు, వాళ్లు రాజ్ భవన్‌ను గౌరవించాలి: తమిళిసై
Governor Tamilisai Delhi Tour: తెలంగాణ గవర్నర్ తమిళిసై తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా వేర్వేరు అంశాలపై చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వంతో తనకు ఎలాంటి మనస్ఫర్థలు లేవని, తాను ఎప్పుడూ ప్రభుత్వం పట్ల సఖ్యతగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటానని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. తనకు చాలా సార్లు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగినప్పటికీ తనకు ఉన్న విస్తృత అధికారాలతో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా.. వాటిజోలికి తాను పోవడం లేదని చెప్పారు. ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలనేదే తన అభిమతమని అన్నారు. ఎమ్మెల్సీకి ఆమోదం తెలపడం సహా వివిధ అంశాల్లో తాను కచ్చితంగా నిబంధనలు పాటించినందుకు చాలా సందర్భాల్లో ప్రభుత్వం గవర్నర్‌కు తగిన మర్యాద ఇవ్వలేదని అందుకు తనకేమీ ఇబ్బంది లేదని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు అవమానం జరిగినా పర్లేదని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే గవర్నర్‌కు, రాజభవన్‌కు అవమానం కలిగించేలా చేయడం సరికాదని అన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా వేర్వేరు అంశాలపై చర్చించారు. అనంతరం భేటీ నుంచి ఆమె బయటకు రాగానే మీడియాతో మాట్లాడారు.
గవర్నర్ కోటాలో కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం గురించి మాట్లాడుతూ.. గవర్నర్ కోటాలో ఆయన అర్హుడు కాదని అన్నారు. సేవా రంగంలో ఉన్నవారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని అందుకే ఆ ఫైల్‌ను తిరస్కరించానని, అందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశానని గుర్తు చేశారు. ఎల్లప్పుడూ తాను రాజ్యంగ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవహరించానని, గవర్నర్ పదవికి, రాజ్ భవన్‌కు మచ్చ తెచ్చేలా ప్రవర్తించలేదని అన్నారు. తాను పారదర్శకంగా వ్యవహరిస్తానని అన్నారు. వివాదాలు, పొరపొచ్చాలు ఎన్ని ఉన్నా తాను ఎల్లప్పుడూ ప్రభుత్వంతో స్నేహంగా ఉండేందుకే ఇష్టపడతానని అన్నారు.
కరోనా సమయంలోనూ ఒక డాక్టర్‌గా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. ‘‘గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మౌలిక సదుపాయాలు పెంచాలని నేను మొదటి నుంచి సూచిస్తున్నాను. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో ఎలుకలు కొరకడం వల్ల పేషెంట్ చనిపోవడం దారుణం. తెలంగాణ గవర్నర్ గానే కాకుండా ఒక డాక్టర్‌గా కూడా నేను సూచించాను. అందులో తప్పేమైనా ఉందా?’’ అని అన్నారు.