Hyderabad rains: రెండు నెలల వానలు మొత్తం 2 వారాల్లోనే... హైదరాబాద్ లో ప్రమాదకరంగా 50 చెరువులు...
వారం పాటు కురిసిన నాన్ స్టాప్ వర్షానికి జులై నెలలోనే చెరువులు పొంగి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయ్. ఎడతెరిపిలేని వర్షానికి అర్థరాత్రి కూడా కంటిమీద కునుకులేకుండా చేసే పరిస్థితులున్నాయి.
ఏటా వానాకాలానికి ముందు రివ్యూ మీటింగులుంటాయి..ప్రణాళికలు వేస్తారు. కానీ వాటిని అమలు చేయడంపై మాత్రం శ్రద్ధ చూపరు. ఫలితంగా ఎడతెరిపిలేని వర్షాలకు ఏది కాలనీ, ఏది చెరువన్నది తేడాలేకుండా పోయింది. ముఖ్యంగా భాగ్యనగరం విషయానికొస్తే అద్భుత ప్రణాళికతో చెరువులను నిర్మించిన చరిత్ర నగరానికి ఉంది. గొలుసుకట్టు తరహాలో వీటి నిర్మాణం సాగింది. ఒకదానితో ఒకటి అనుసంధానం కావడం వల్ల ఒక చెరువు నిండగానే కింది చెరువుకు అదనపు నీరు వెళ్లేది. ఏళ్లుగా ఈ నాలాలు ఆక్రమణలకు గురై అదనపు నీరు కింది చెరువుల్లోకి వెళ్లే మార్గాలు మూతపడ్డాయి. దీంతో ఏ క్షణం కట్టలు తెగి నీరు పొంగుతుందో అనే భయం గుప్పిట్లో ఉన్నారు భాగ్యనగరవాసులు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక కింద నాలాల రూపు మారుస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పచికీ నిధుల సమస్యతో పనులు ముందుకు సాగడం లేదు. అక్కడక్కడ కట్టలు వెడల్పు చేసినా పనులు నాసిరకంగా సాగాయి.
హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయికి చేరింది. నగరంలో మిగిలిన చెరువుల విషయానికొస్తే... బురాన్‌ఖాన్ చెరువులో పూర్తిస్థాయి నీటి మట్టం చేరడంతో సమీపంలో ఉస్మాన్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలు ముంపు నీటిలో ఉన్నాయి. వనస్థలిపురం కప్రాయ్ చెరువు పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది. 20 కాలనీల్లో రహదారులపైకి నీరు చేరింది. తూర్పు ఆనంద్‌బాగ్‌లోని బండచెరువు సుమారు 35 ఎకరాల్లో ఉంది. ఆర్కేపురం చెరువు నుంచి సఫిల్‌గూడ చెరువు.. అక్కడి నుంచి బండ చెరువులోకి వరద నీరు ప్రవహిస్తుంది. పూడికతో పాటు అస్తవ్యస్త నాలాల కారణంగా బండ చెరువు నుంచి వస్తున్న వరద నీరు ఐదు కాలనీలను ముంచెత్తుతోంది. షిర్డీనగర్, ఎన్‌ఎండీసీ కాలనీలకి సమీపంలో ఉన్న చెరువు నుంచి ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తున్నా కాలనీలకు ముంపు తప్పడం లేదు.
మీర్‌పేట పెద్ద చెరువు, మంత్రాల చెరువు ఇప్పటికే నీటితో నిండిపోయాయి. వారం రోజుల కిందట కురిసిన భారీ వానలకు మిథిలా నగర్ సహా మరో పది కాలనీలకు ముప్పు పొంచి ఉంది. చందన చెరువు ఇప్పటికే పొంగుతోంది. బండ్లగూడ చెరువు వరద కారణంగా అయ్యప్ప కాలనీ మునిగిపోయింది. మళ్లీ భారీ వర్షాలొస్తే కాలనీలోని మిగిలిన ఇళ్లతో పాటు మల్లికార్జున నగర్ ఫేజ్-1, 2 ముంపునకు గురి కానున్నాయి. రామంతాపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువు సైతం నిండిపోయాయి. భారీ వర్షాలకు చిన్న చెరువు తూముల సామర్థ్యం సరి పోవడం లేదు.
ఎర్రగుంట చెరువు నాచారంలో నాలాలు ఆక్రమణకు గురవడంతో వరదనీరు ఇళ్ల మధ్య నుంచి వెళుతోంది. జల్‌పల్లి పెద్ద చెరువు, పల్లె చెరువు నిండిపోవడంతో మళ్లీ భారీ వర్షాలొస్తే జల్‌పల్లి రహదారిపై నీరు పొంగిపొర్లే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి ఉందా సాగర్‌కు నీరు చేరుతుండటంతో గతేడాది తరహాలో పాతబస్తీలోని బాబా నగర్‌కు ముప్పు పొంచి ఉంది. జీడిమెట్ల సమీపంలో ఫాక్స్ సాగర్ నిండిపోయింది. గతేడాది ఉమామహేశ్వర కాలనీ సహా పలు కాలనీలు మునిగిపోయాయి. తూములకు మరమ్మతులు చేయకపోవడంతో పరిస్థితి యథాతథంగా ఉంది.
హయత్ నగర్‌లోని బాతుల చెరువు, కుమ్మరికుంట ప్రమాదకరస్థితికి చేరాయి. అంబేడ్కర్‌బస్తీ, రంగనాయకుల గుట్ట, బంజారా కాలనీ, తిరుమల కాలనీకి ముప్పు పొంచి ఉంది. బాతుల చెరువు నుంచి నీరు బయటకు పోవాల్సిన మార్గంలో రెండు తూములు, అలుగు పూడుకుపోయాయి. పెద్దఅంబర్‌పేట ఈదుల చెరువులోకి వెళ్లేందుకు వీల్లేక బస్తీలు మునిగే స్థితికి చేరుకున్నాయి.
రాజేంద్రనగర్‌లోని అప్పా చెరువు కట్టను రూ.20 లక్షల వ్యయంతో విస్తరించగా నెల రోజుల కిందటి వానలకే కోతకు గురైంది. వాస్తవానికి గతేడాది ఈ కట్ట తెగి కర్నూలు జాతీయ రహదారి కొంతభాగం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ప్రస్తుతం ఈ చెరువు నిండి మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఓవరాల్ గా చూస్తే నగరంలో ఈ ఏడాది జులైలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. వానాకాలం మొత్తం కురియాల్సిన వానలు కేవలం రెండు వారాల్లోనే దంచికొట్టాయి. దీంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. 15 రోజుల వ్యవధిలో 25 సెం.మీ. నుంచి 40 సెం.మీ. వాన పడింది. ఆల్‌టైమ్ రికార్డు 42.2 సెం.మీ. వాన 1989లో నమోదైంది. ఇటీవల వానలతో సగటున గ్రేటర్‌లో 20 సెం.మీ.పైన వర్షం పడింది. నగరంలో జూన్, జులైలో సాధారణ వర్షపాతం 276.5 మి.మీ. కాగా.. రంగారెడ్డిలో 244.7 మి.మీ., మేడ్చల్ జిల్లాలో 287.6 మి.మీ.గా ఉంది.