YS Sharmila Gets Bail: వైఎస్ షర్మిలకు భారీ ఊరట, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Nampally Court grants bail to YS Sharmila: వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆమె రిమాండ్ ను తిరస్కరించిన మేజిస్ట్రేట్, వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలకు బెయిల్ మంజూరు చేశారు.
Nampally Court grants bail to YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరైంది. వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి షర్మిలను నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట ఆమెను హాజపరచగా, దాదాపు రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. వైఎస్ షర్మిలకు రిమాండ్ తిరస్కరించిన మేజిస్ట్రేట్, ఆమెకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. కూతురు షర్మిలకు బెయిల్ రావడంతో ఆమె తల్లి విజయమ్మ దీక్ష విరమించారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, కోర్టులపై తమకు నమ్మకం ఉందన్నారు.
వైఎస్ షర్మిలపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఐపీసీ 143, 341, 290, 506, 509, 336, 382 r/w 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. వైఎస్ షర్మిల సహా మొత్తం ఆరుగురిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల స్వయంగా కారు నడిపి ముందుకెళ్లేందుకు యత్నించారు. అయినా పోలీసులు కారును ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆగ్రహంతో షర్మిల కారులోనే కూర్చుండిపోయారు.
పోలీసులు షర్మిలను కారుతోపాటు తీసుకెళ్లి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌కు చేరాక అక్కడ కూడా హైడ్రామా నడిచింది. కారులో ఉన్న షర్మిల బయటకు వచ్చేందుకు నిరాకరించారు. పోలీసులు ఎంతగా రిక్వస్ట్ చేసినా బయటకు వచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు బలవంతంగా కారు డోర్ తెరిచి ఆమెను బయటకు తీసుకొచ్చే క్రమంలోనూ పోలీస్‌స్టేషన్ వద్ద హైడ్రామా నడిచింది. చివరకు పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి ఎస్సార్ నగర్ పీఎస్‌లోనే ఉంచారు. షర్మిలను మంగళవారం రాత్రి ఎస్సార్ నగర్ పీఎస్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. మేజిస్ట్రేట్ ఎదుట షర్మిలను పోలీసులు ప్రవేశపెట్టగా.. రోజుల రిమాండ్ విధించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసును నమోదు
వైఎస్ షర్మిల తో పాటు మరో ఆరు మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వైఎస్ షర్మిలతో పాటు హిందూజా రెడ్డి, సుధారాణి, ఎండి ముష్రాఫ్, బాషా, సంజీవ్ కుమార్, శీను లపై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. రాష్ అండ్ నెగ్లిజెన్స్ గా డ్రైవ్ చేస్తూ తమపైకు వాహనం దూసుకొచ్చేటట్టు షర్మిల నడిపినట్లు పోలీసులు ఆరోపించారు. అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తుండగా వీడియో చిత్రీకరిస్తున్న ఎస్సై మొబైల్ ఫోన్ షర్మిల లాక్కున్నారని పోలీసులు అంటున్నారు. డ్యూటీ చేస్తుండగా విధులకు ఆటంకం కలిగించారంటూ సైతం పోలీసులు షర్మిలపై కేసులు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్ నేతలు షర్మిల ప్రచార రథం, వాహనాలపై దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా ప్రగతి భవన్‌కు ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ కు వస్తున్న షర్మిలను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారు షర్మిల స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు బయలుదేరారు. రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను ఆమెను అడ్డుకున్న పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్‌కు చూపించడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ విజయమ్మ హౌస్ అరెస్ట్..
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆమెను చూసేందుకు షర్మిల తల్లి విజయమ్మ బయలుదేరారు. విజయమ్మ ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విజయమ్మ కారుకు పోలీసుల వాహనాన్ని అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహించిన విజయమ్మ కారు దిగి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మహిళా కానిస్టేబుల్స్ విజయమ్మను అడ్డుకున్నారు. అనంతరం విజయమ్మను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ‘తమాషాలు చేస్తున్నారా, పోలీసులను చూడలేదా, ప్రభుత్వాలు చూడలేదా? మేము ప్రభుత్వాలను నడిపినవాళ్లమే? మీలాంటి వాళ్లను చూసినవాళ్లమే. మీరు ఇలానే నన్ను ఆపితే రాష్ట్రం మొత్తం బంద్ కు పిలుపునిస్తాను’ అని విజయమ్మ హెచ్చరించారు.