YS Sharmila: కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చారు? విడాకులు అడుగుతున్నామా? షర్మిల వ్యాఖ్యలు
తనను పదే పదే ఆంధ్రా నుంచి వచ్చానని అంటున్నారని వైఎస్ షర్మిల అన్నారు. మరి కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీలో ప్రతి నాయకుడిపైన విచారణ జరగాలని, ఐటీ సోదాలు జరగాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి ఇళ్లపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతోందని, కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందని దుయ్యబట్టారు. కేసీఆర్ దగ్గర ఉన్నవాళ్లు అంతా తాలిబన్ సైన్యమే అని ఎద్దేవా చేశారు. గురువారం (డిసెంబర్ 1) రాజ్ భవన్‌కు వెళ్లిన వైఎస్ షర్మిల గవర్నర్ తమిళిసైను కలిశారు. తనను అరెస్టు చేయడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ గతంలో మాట్లాడిన చెడు వ్యాఖ్యలను షర్మిల ప్రదర్శించారు.
తనను పదే పదే ఆంధ్రా నుంచి వచ్చానని అంటున్నారని వైఎస్ షర్మిల అన్నారు. మరి కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఆమె ఆంధ్రా నుంచి వచ్చిందని షర్మిల అన్నారు. అలాంటప్పుడు ఆమెతో విడాకులు తీసుకోవాలని మేము అడుగుతామా? అంటూ నిలదీశారు. తాను పుట్టింది.. పెరిగింది.. వివాహం అన్నీ హైదరాబాద్‌లోనే అయ్యాయని మరోసారి వైఎస్ షర్మిల అన్నారు. ఏ కారణం లేకుండానే తమపై టీఆర్ఎస్ నేతలు, పోలీసులు దాడి చేశారని షర్మిల మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనలు, అరెస్టు వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
నేను రేపటి నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగిస్తా. కొద్ది రోజుల నుంచి టీఆర్‌ఎస్ నేతలు మాపై దాడులు చేస్తున్నారు. పాదయాత్ర కొనసాగిస్తే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నాకు, నా కార్యకర్తలకు ఏమైనా జరిగితే టీఆర్ఎస్, కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అవుతుంది. కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చారు. ఆమె ఏపీకి చెందిన వ్యక్తి కాదా? ఆమెను గౌరవించడం లేదా?’ అని షర్మిల ధ్వజమెత్తారు.
అందరి ఇళ్లలో సోదాలు చేయాలి - షర్మిల
‘మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. కేటీఆర్, కవిత సహా టీఆర్ఎస్ నేతల అందరి ఇళ్లలో సోదాలు చేయించాలి. లక్షల కోట్లు బయటపడతాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉంది. డబ్బు సంపాదించడం తప్ప టీఆర్‌ఎస్ నేతలు చేసింది ఏమీ లేదు. అవినీతి, భూకబ్జాలు ప్రశ్నించడం రెచ్చగొట్టడం అవుతుందా. ఉద్యమకారులను వెళ్లగొట్టేసి పార్టీలో అందరూ తాలిబన్‌లను చేర్చుకున్నారు’’ అని షర్మిల ధ్వజమెత్తారు.