Vande Bharat Express: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్- 10 గంటల్లోనే సికింద్రాబాద్ చేరుకోవచ్చు!
Vande Bharath Express: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానుంది. సికింద్రాబా-వైజాగ్ మధ్య సెమీ హై స్పీడ్ తో ఈ ఎక్స్ ప్రెస్ పరుగులు పెట్టనుంది.
Vande Bharath Express: ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 2023లో రాష్ట్ర రాజధానికి చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య సెమీ హై స్పీడ్ తో ఈ రైలు పరుగులు పెట్టనుంది. అయితే ముందుగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం చేరూర్చే విధంగా విశాఖపట్నం వరకు పొడగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఈ రైలు వరంగల్, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య రైలు నడపడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం..
అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ ప్రస్తుతానికి ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ మాదిరిగా కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ దూరం, రాత్రంతా ప్రయాణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గరిష్ఠంగా 10 గంటల్లోనే చేరే గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఉదయమే బయలు దేరి సాయంత్రానికి లేదా రాత్రి 9, 10 గంటల్లోపు గమ్య స్థానం చేరేలా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు న్యూఢిల్లీ నుంచి ఉత్తర జమ్మూలోని వారణాసికి అలాగే వైష్ణో దేవితో బెంగళూరు మీదుగా మైసూరు, చెన్నైతో కలుపుతున్నాయి. వాస్తవానికి, రాబోయే మూడేళ్లలో చాలా పెద్ద, మధ్య తరహా నగరాలను కలుపుతూ 400 కొత్త తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) తయారు చేసింది.
వేగ పరిమితులు..
ఒక్క రేక్ ఖరీదు రూ.100 కోట్లకు పైమాటే. దీని గరిష్ట వాణిజ్య వేగం గంటకు 160 కి.మీ. పరీక్ష సమయంలో ఇది 180 కేఎంపీహెచ్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆ స్పీడ్‌ను తట్టుకునే శక్తి ఇప్పుడు ఉన్న ట్రాక్‌లకు లేదు. అందువల్ల రైలు గరిష్టంగా 130 కేఎంపీహెచ్ వేగంతో నడుస్తుంది. ఇందులో 16 ప్యాసింజర్ కార్లు ఉన్నాయి. వీటిలో 11 వందల కంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంది. కోచ్ ఛాసిస్ 23 మీటర్ల పొడవు ఉంటుంది. రైలు ఫ్రేమ్ పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. వందేభారత్ తయారీకి సంబంధించిన 80 శాతానికి పైగా భాగాలు మన దేశానికి చెందినవే. ఇది జీపీఎస్-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ. బయో-వాక్యూమ్ టాయిలెట్‌లు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కలిగి ఉంటుంది.