TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!
ఈ పండగ సీజన్‌లో ఆర్టీసీకి రూ.10 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. స్పెషల్ బస్సుల ద్వారా రూ.4.5 కోట్లు, మామూలు బస్సులతో రూ.5.5 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు సమాచారం.
ఈ సంక్రాంతి పండుగ తెలంగాణఆర్టీసీకి బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది సొంతూర్లకు రాకపోకలు సాగించారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళిక ప్రకారం టీఎస్ ఆర్టీసీ దాదాపు 3,400 స్పెషల్ బస్సులను నడిపింది. మొత్తానికి ఈ పండగ సీజన్‌లో ఆర్టీసీకి సుమారు రూ.10 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. స్పెషల్ బస్సుల ద్వారా సుమారు రూ.4.5 కోట్లు, మామూలు బస్సు సర్వీసులతో రూ.5.5 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు సమాచారం. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పండగ సీజన్‌లో కాస్త ఊరట లభించినట్లయింది.
అయితే, ఆర్టీసీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ ఛార్జీలను ఏం పెంచలేదు. సాధారణంగా రద్దీ ఉన్న సమయాల్లో టికెట్లను 50 శాతం పెంచుతారు. ఎందుకంటే తిరుగు ప్రయాణాల్లో ప్రయాణికులు ఉండరు కాబట్టి.. బస్సులు ఖాళీగా వెనక్కి రావాల్సి ఉంటుంది. ఆ నష్టాన్ని భరించేందుకు ఇలా చేస్తుంటారు. కానీ, ఈ సంక్రాంతికి ఆర్టీసీ పక్కా ప్రణాళిక పరంగా ముందుకు వెళ్లింది. దసరాకు సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి అందరి మెప్పును పొందింది.
మరోవైపు, ఇదే టైంలో ఏపీఎస్ఆర్టీసీ అదనపు ఛార్జీలు బాదడం తెలంగాణ ఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 7 నుంచి 14 వరకు 3,400 ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి బస్సులు కాగా మిగిలిన 2,400 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడిపింది.
పండక్కి నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా సుమారు 20 లక్షల మందిని గమ్య స్థానాలకు అత్యంత క్షేమంగా చేర్చినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇవి కాక, రోజూ తిరిగే 4,600 సర్వీసుల ద్వారా మరో 1.50 లక్షల మందిని సొంతూళ్లకు చేరవేసినట్లు అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ పండుగ సీజన్‌లో 22 లక్షలకు పైగా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం కల్పించినట్లు ఆర్టీసీ వెల్లడించింది.
Also Read: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..
Also Read: TS High Court: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు