TSRTC: టీఎస్ఆర్టీసీ షాక్! స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు, ఈ రూట్‌లో మాత్రమే..
సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ నెల 13 నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలు చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
సంక్రాంతి పండక్కి నడిపిన ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు ఎక్కువ టికెట్ ఛార్జీలు తీసుకొనే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి శంషాబాద్ దగ్గరున్న ముచ్చింతల్ శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాలని గురువారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
మరోవైపు, సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ నెల 13 నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలు చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. గత దసరా, సంక్రాంతి సమయాల్లో నడిపిన స్పెషల్ బస్సుల్లో అదనపు టికెట్ ఛార్జీలు వసూలు చేయని ఆర్టీసీ.. ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది. ఆ పండుగల సీజన్ సందర్భంగా అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా అప్పట్లో రూ.75-100 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఆర్టీసీ ఆదాయం పరంగా చూస్తే.. గత ఏడాది జనవరిలో ఆర్టీసీకి రూ.337.79 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది జనవరిలో కేవలం రూ.287.07 కోట్లకే పరిమితం అయింది. రూ.51 కోట్ల ఆదాయం తగ్గింది. గత డిసెంబరు ఆదాయం రూ.352.67 కోట్లతో పోల్చినా జనవరిలో రూ.65.55 కోట్ల మేర తగ్గింది.
సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు..
రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవం ముడో రోజు అష్టాక్షరి మహామంత్ర జపంతో నిర్విఘ్నంగా ప్రారంభం అయింది. మహా యాగంలో ఈ రోజు ఐశ్వర్య ప్రాప్తికై శ్రీలక్మీ నారాయణేష్టి, వైనతేయేష్టి ఆరాధన జరగనున్నాయి. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా పరిగణిస్తూ పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన అష్టాక్షరీ మహామంత్ర జపం 7 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ఉదయం 8. 30 గంటలకు హోమాలు ప్రారంభించారు. ఆ తర్వాత 10 గంటల 30 నిమిషాలకు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్య ప్రవచనం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల 30 గంటలకు పూర్ణాహుతి నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఇంకోసారి హోమాల కార్యక్రమం ఉంటుంది. ప్రవచన మండపంలో లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సతీసమేతంగా పాల్గొన్న సంగతి తెలిసిందే. సమతామూర్తి విగ్రహం వద్ద ఏర్పాట్లు పరిశీలించారు.