TSPSC Paper Leak: పేపర్ లీక్‌పై గవర్నర్ తమిళిసై సీరియస్ - 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ప్రభుత్వ సర్వీస్ కోసం శ్రమిస్తున్న అభ్యర్థులకు ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Governor Tamilisai TSPSC Paper Leak Incident: తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఎంతో భవిష్యత్ ఉంటుందని నమ్మి ప్రభుత్వ సర్వీస్ కోసం శ్రమిస్తున్న అభ్యర్థులకు ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా తనకు పూర్తి నివేదిక సమర్పించాలని టీఎస్ పీఎస్సీని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. ప్రతిష్టాతక రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్ నుంచి ప్రశ్నాపత్రం లీకేజీని తీవ్రంగా పరిగణించి, సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పేపర్ లీకేజీ కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్
టీఎస్ పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితులను చంచల్ గూడ జైలు కు పోలీసులు తరలిస్తున్నారు. అంతకుముందు 9 మంది నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏఈ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో జరిగిన గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం రీ కరెక్షన్ పేరుతో పైరవీలు చేసి జాబ్స్ ఇప్పించాడని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి. లెక్చరర్‌గా పని చేయాలన్న నిబంధనలను పక్కనపెట్టి, పలువురు మహిళలకు ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేశాడని కొత్త కోణం వెలుగుచూసింది.
దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేసిన సర్కార్
టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరగనుంది. అంతకుముందు అన్ని నియామక బోర్డులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బీఆర్కే భవన్ లో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.
నిందితుడు ప్రవీణ్ వద్ద కాపీలు స్వాధీనం
ఏఈ పేపర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్లు, టెక్నికల్ ఆఫీసర్ పరీక్షల పేపర్లు లీక్ ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా ఏఈ పేపర్ నకళ్లు ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద ఏఈ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్లను ఉంచుకున్నాడు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేపర్ నకళ్లు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక అడిగినందువల్లే టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, , పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి పేపర్లు లీక్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 837 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులకు మార్చి 5న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తొలుత మార్చి 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది.