Telangana Police: అయోధ్యా నగరంలో వేడుకలు, భాగ్యనగరంలో భారీ బందోబస్తు
Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Tight Security In Hyderabad: అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, పక్కాగా బందోబస్త్ నిర్వహించాలని సూచించారు. స్థానిక పోలీసులకు సాయంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసులు, గ్రే హౌండ్స్, సాయుధ రిజర్వ్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర బలగాలు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్ధంగా ఉంచారు.
డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో గత వారం జిల్లాల్లో ఎస్పీ స్థాయిలో సమావేశాలు జరిగినట్లు చెప్పారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో స్థానిక పోలీసులకు సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కమిషనర్ టాస్క్ ఫోర్స్, టీఎస్‌ఎస్పీ పోలీసుల సహకారం ఉంటుందన్నారు. మతపరమైన, సున్నితమైన ప్రదేశాలలో పోలీసులు ఇప్పటికే పికెటింగ్ ఏర్పటు చేశారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రజల కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు నిర్వహించే ప్రదేశాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లు ప్రారంభించాలని స్థానిక పోలీసులను డీజీపీ ఆదేశించారు.
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో సందడి నెలకొంది. చార్మినార్ ఎదుట ఉన్న భాగ్య లక్ష్మీ అమ్మవారి ఆలయం ఎదుట రామభక్తులు సోమవారం ఉదయం పూజలు చేశారు. అనంతరం రాముడి ఫొటతో కాషాయం జెండాలు పట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ, ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల వాహనాలకు కాషాయ జెండాలు కట్టుకుని తిరుగుతున్నారు.
నేతలతో పోలీసుల సమావేశం
అయోధ్య రామమందిర ఉత్సవాల సందర్భంగా పోలీసులు స్థానిక రాజకీయ నేతలతో సమావేశం అవుతున్నారు. నగరంలో శఆంతి భద్రతలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. పుకార్లు నమ్మవద్దని, రెచ్చగొట్టవద్దని, శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులు ప్రజలను కోరారు. అలాగే శాంతిభద్రతలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా డయల్ 100కు ఫోన్ చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అయోధ్యలో భారీ భద్రత
దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్న టైంలో ఈ వేడుకు టైట్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఎన్‌ఎస్‌జీ స్నిపర్‌ల రెండు బృందాలు, ATS కమాండోల ఆరు బృందాలు యాంటీ డ్రోన్ టెక్నాలజీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్, పారామిలటరీకి చెందిన 15,000 మంది పోలీసులు అయోధ్య కోసం కాపలాగా ఉంటున్నారు. అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ మాట్లాడుతూ, "అయోధ్య వచ్చే గెస్ట్‌లతో సమన్వయం చేయడానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. కేంద్రీకృత స్ప్రెడ్‌షీట్‌లో ముఖ్యమైన అతిథుల వివరాలు అప్‌డేట్ చేస్తున్నాము. అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సంబంధిత విభాగాలు, ఏజెన్సీలను అప్రమత్తం చేస్తున్నాము. అన్నారు.
11 భాషల్లో సైన్ బోర్డులు
విభిన్న ప్రాంతాల నుంచి భక్తులు, వీఐపీలు వస్తున్న వేళ భారీ సంఖ్యలో సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు. 11 ప్రధాన భాషల్లో అయోధ్య నలువైపులా సైన్ బోర్డులు పెట్టారు. 400 సైన్ బోర్డులు ల్యాండ్‌మార్క్‌ల వద్ద ఉంచారు. సాధారణ ప్రజలు చలిని తట్టుకునేందుకు 300 చోట్ల గ్యాస్‌తో నడిచే హీటర్లు ఉంచారు. ఇప్పటికే హోటళ్లు, ఇతర పర్యాటక ప్రదేశాలు, విడిది కేంద్రాలు కిటకిట లాడుతున్నాయి. వీటితోపాటు 25,000 పడకలతో అతిపెద్ద ఎనిమిది తాత్కాలిక టెంట్ సిటీలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు.