(Source: ECI/ABP News/ABP Majha)
ఉస్మానియా యూనివర్శిటీలోని మెట్లబావి చరిత్ర మీకు తెలుసా !
బన్సీలాల్ మెట్లబావి తర్వాత ఓయూలోని మెట్లబావిపై అధ్యయనంప్రముఖ నాట్యగత్తె మహాలఖాబాయి పేరుమీద మెట్లబావి
Stepswell OU in Hyderabad: ఓయూ క్యాంపస్‌లో నిజాం కాలం నాటి మెట్లబావి ఒకటి ఆదరణకు నోచుకోక కాలగర్భంలో నిశ్శబ్దంగా తలదాచుకుని ఉంది. అది ఇఫ్లూ బిల్డింగ్ దగ్గర ఉందన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. చెత్తాచెదారంతో రూపురేఖలు కోల్పోయి దీనావస్థలో ఉన్న ఆ చారిత్రక మెట్లబావిని మరో బన్సీలాల్ పేట బావిలా మెరుగులు దిద్దాలనేది HMDA సంకల్పం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు, హెచ్ఎండీఏ అధికారులు దాదాపు 100 మంది శ్రమదానం చేసి పనులను ప్రారంభించారు. ఈ పునరుద్ధరణ పనుల్లో రెయిన్ వాటర్ ప్రాజెక్ట్, లైన్స్ క్లబ్, పింక్ సర్కిల్, గ్రీన్ టీమ్ (వనపర్తి) సంస్థలు, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పర్యావరణ విభాగం స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ చదివేవాళ్లు, ఆర్కియాలజీ విద్యార్ధులు, హిస్టరీ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఓయూ విద్యార్థులు పాలుపంచుకున్నారు.
బన్సీలాల్ పేట మెట్లబావి తర్వాత ఇదే ప్రాజెక్ట్
బన్సీలాల్ పేట మెట్లబావి! 18వ శతాబ్దానికి చెందిన ఈమెట్లబావి హైదరాబాద్ చారిత్రక వారసత్వానికి నిదర్శనం. 22 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఈ బావి సొంతం. రాయి, డంగు సున్నంతో అద్భుతమైన శైలిలో నిర్మించారు. వందల ఏండ్ల క్రితం సికింద్రాబాద్ ప్రాంత ప్రజల దాహాన్ని తీర్చిన ఈ బావి కాలక్రమంలో మరుగున పడింది. తెలంగాణ సర్కారు, ఎన్జీవోల సహకారంతో అది పునర్ వైభవం సంతరించుకుంది. . అద్భుతంగా తీర్చిదిద్దిన మెట్ల బావి గురించి ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారు. ఆ తరువాత రెండు, మూడు నెలలుగా HMDA యంత్రాంగం ఉస్మానియా యూనివర్సిటీలోని పురాతన బావులపై అధ్యయనం చేసింది. ఓయూ వీసీ రవీందర్, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ కల్పనా రమేష్, HMDA ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు అనేకసార్లు సమావేశమై కార్యాచరణను రూపొందించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు HMDA మెట్రోపాలిటన్ కమిషనర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు, పలు స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు తదితరులు ఈ బావుల పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. దాదాపు 100 మంది కలిసి బావుల్లో చెత్తాచెదారాన్ని వెలికితీశారు.
ఓయూలో మెట్ల బావిని ఎవరి కోసం కట్టారు? దీని చరిత్రేంటి?
ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్లో ఉన్న ఈ మెట్లబావికి ఒక చరిత్ర ఉంది. ఇదో ఆసక్తికరమైన అంశం! నిజానికి ఉస్మానియా క్యాంపస్ చిన్నపాటి అడవి! జాగీర్! ఎస్టేట్, తోటబంగళా! ఆ స్థలం మహాలఖా బాయి చందా పేరుమీద ఉండేది! ఎవరీ మహాలఖాబాయి అంటే, నిజాం కాలంలో మహానర్తకి. మంచి గాయకురాలు. ఆమె పాడితే మనసున మల్లెలు మాలలూగుతాయి! ఆమె ఆడితే మదిలో మయూరాలు వరుసలు కడుతాయి. ఆమె గజల్స్ గాత్ర సౌందర్యానికి యావత్ దక్కన్ సామ్రాజ్యమే గులామ్ అయ్యింది. అంతేకాదు మహాలఖాబాయి స్వతహాగా కవయిత్రి, స్త్రీవాది, పొలిటికల్ అడ్వయిజర్! 18వ శతాబ్దంలోనే బాలికా విద్య కోసం పోరాడిన ఉద్యమకారిణి.
ఆడపిల్లలు చదువుకోవాలని ఆ రోజుల్లోనే తన యావదాస్తి రాసిచ్చిన మానవతామూర్తి! కోటి రూపాయలు గర్ల్స్ ఎడ్యుకేషన్కోసం విరాళంగా ఇవ్వడం ఆరోజుల్లో మామూలు సంగతి కాదు! అంతేకాదు ఇప్పుడున్న ఉస్మానియా యూనివర్శిటీ కూడా ఆమె జాగీరే! యూనివర్శిటీ కోసం ఆమె తన ఎడంచేత్తో ధారాదత్తం చేసిందా స్థలాన్ని! ఆ టైంలోనే నిజాంరాజు ఈ బావిని ఆమె పేరుమీద నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ మెట్ల బావి దగ్గర పున్నమి వెన్నెల రాత్రుళ్లలో గజల్స్ పాడేవారు. అలాంటి చారిత్రక మెట్లబావికి పూర్వ వైభవం తెచ్చే పనిలో పడింది హెచ్ఎండీయే!