Hyderabad News: 3 రోజులుగా కొడుకు మృతదేహంతోనే తల్లిదండ్రులు- వచ్చి అన్నం పెడతాడని ఆశగా ఎదురు చూపులు- కన్నీళ్లు పెట్టించే స్టోరీ
Crime News: కుమారుడు చనిపోయాడని తెలుసుకోలేక మూడు రోజులుగా మృతేదేహంతోనే ఉన్నారు దివ్యాంగులైన తల్లిదండ్రులు. దుర్వాస వస్తున్నా గమనించలేకపోయారు.
Hyderabad Crime News: హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. కుమారుడు చనిపోయి మూడు రోజులు అవుతున్నా దివ్యాంగులైన కన్నవాళ్లు గుర్తించలేకపోయారు. మృతదేహాం చుట్టే తిరుగుతున్నారు తప్ప తెలుసుకోలేకపోయారు. వాసన వస్తుంటే ఏదో చనిపోయి ఉంటుందనుకున్నారు. కొడుకు వచ్చి అన్నం పెడతాడంటూ ఆశగా ఆకలితో ఎదురు చూశారు.
నాగోల్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇదే ప్రాంతంలో ఉంటున్న రమణ, శాంతకుమారి దివ్యాంగ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వేరుగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు కన్నవారితోనే ఉంటున్నాడు. రమణ ట్రైబల్ వెల్ఫేర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన డబ్బులతో తాగుతూ జల్సాలు చేస్తూ తిరుగుతున్నాడు. ఈ కారణంగానే భార్య చాలా ఏళ్ల క్రితం విడిచిపెట్టి వెళ్లిపోయింది.
చిన్న కుమారుడికి ఫిట్స్ కూడా ఉంది. తల్లిదండ్రులతో ఉంటున్న చిన్నకొడుకు... ఎప్పుడో వచ్చి తల్లిదండ్రులకు భోజనం పెట్టే వాడు. అయితే మూడు రోజుల క్రితం ఎప్పటి మాదిరిగానే ఫుల్‌గా తాగి వచ్చాడు చిన్న కొడుకు. అలా తాగి వచ్చిన టైంలోనే ఫిట్స్ వచ్చింది. దీంతో ఇంట్లోనే చనిపోయాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయిన ఆ కన్నవాళ్లు... చిన్న కుమారుడి కోసం ఎంతగానో ఎదురు చూశారు.
చిన్న కుమారుడు వస్తాడని ఆకలి తీరుస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎప్పటికీ రాలేదు. అంతే కాకుండా ఇంట్లో దుర్వాసన కూడా వస్తుండటాన్ని గుర్తించారు. ఏదో జీవి చనిపోయి ఉంటుందని సర్ది చెప్పుకున్నారు. కొడుకు వస్తే అదేంటో తెలుసుకుంటాడని అనుకున్నారు. అంతే కానీ కుమారుడు చనిపోయి ఉన్నారనే విషయాన్ని గుర్తించలేకపోయారు.
చుట్టుపక్కల వాళ్లకి కూడా దుర్వాసన రావడం ప్రారంభమైంది. కంటిన్యూగా వస్తున్న వాసన భరించలేక నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో సోమవారం ఆ ఇంటికి వచ్చిన నాగోల్ పోలీసులకు అసలు విషయం తెలిసింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే షాక్ తిన్నారు. ఓవైపు కుళ్లిపోయిన మృతదేహం ఉంటే... అక్కడే ఏం తెలియకుండా కూర్చొని ఉన్న పేరెంట్స్‌ను చూసి కంగుతిన్నారు.
పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు పెద్ద కుమారుడిని అక్కడకు పిలిచి తల్లిదండ్రులను అప్పగించారు. వారికి అప్పటికే భోజనం పెట్టారు. ఇతర సపర్యలు చేశారు. మూడు రోజుల నుంచి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటకు రాకపోవడం, ఎలాంటి మూమెంట్ లేకపోయనా స్థానికులు గమనించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read: పోస్ట్‌మ్యాన్‌కు కబురు చేస్తే చాలు, మీ ఇంటి వద్దే 'డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్' సర్వీస్