Telangana News: రేపటితో ముగియనున్న సర్పంచ్ ల పదవీకాలం, అధికారులకు పాలన అప్పగింత
Telangana News: తెలంగాణ రేపటితో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుండటంతో...పాలనను అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Telangana Sarpanch Tenure : తెలంగాణ రేపటి(గురువారం)తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. ఫిబ్రవరి ( February) ఒకటి నుంచి సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుండటంతో...పాలనను అధికారుల (Officers) కు అప్పగిస్తూ ప్రభుత్వం (Government) నిర్ణయం తీసుకుంది. దీంతో వారి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల "కీ"లను తీసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున... సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల కీలను బుధవారమే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ఫిబ్రవరి మూడో తేదీన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అన్ని మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారి ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు, ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఎంపీడీవోలు, జనాభా ప్రాతిపదికన డిప్యూటీ తహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించనుంది ప్రభుత్వం. ఈ సందర్బంగా పాలన ఎలా ఉండాలో వారికి మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
షెడ్యూల్ వచ్చే కొనసాగించాలంటోన్న సర్పంచులు
ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు తమనే పదవిలో కొనసాగించాలంటూ సర్పంచులు కోరుకుంటున్నారు. అయితే పొడిగింపుపై ప్రభుత్వం ససేమిరా అంటోంది. తమ పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు పాలన అప్పగించాలని కోరుతున్నారు. కొత్త గ్రామ పంచాయతీల నిర్మాణం, శ్మశాన వాటిక, ప్రకృతి వనం లాంటి కార్యక్రమాలను గత ప్రభుత్వం టార్గెట్ గా పెట్టింది. దీంతో చాలా మంది సర్పంచులు...అప్పులు చేసి పనులను పూర్తి చేశారు. బిల్లుల మంజూరులో కేసీఆర్ సర్కార్ తీవ్ర జాప్యం చేసింది. అందుకే తమను కొనసాగించాలని సర్పంచులు కోరుతున్నారు.
ప్రస్తుతం డిజిటల్ సంతకాల కీలు, పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. దీంతో వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. ఫిబ్రవరి రెండో తేదీన విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు...ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీ లను ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కొనసాగింది. పిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారుల సంతకాలతో నిధులు డ్రా చేసుకొని వీలు కల్పించింది.