Revanth Reddy : వచ్చే ఏప్రిల్‌లో తెలంగాణలో ఎన్నికలు- టీఆర్‌ఎస్‌తో ప్రశాంత్ కిషోర్ చర్చలు అందుకే- బాంబు పేల్చిన రేవంత్
టీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తి లేదని తేల్చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో వచ్చే ప్రభుత్వం తమదేనని... ఈ విషయం తెలిసే టీఆర్‌ఎస్, బీజేపీలో గుబులు మొదలైందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు రాబోతున్నాయని... కచ్చితంగా 90 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు రేవంత్.
2004 నుంచి కాంగ్రెస్‌ను మోసగిస్తున్న టీఆర్‌ఎస్, కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎందుకు కలిసి పోటీ చేస్తుందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణను విచ్చలవిడిగా దోచుకున్న బంది పోటు దొంగలతో తామెప్పటికీ కలబోమన్నారాయన. దిల్లీ హైకమాండ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉందని వెల్లడించారు. మొన్న రాహుల్ గాంధీతో సమావేశంలో కూడా క్లారిటీ ఇచ్చారన్నారు.
కేసీఆర్ నమ్మదగ్గ వ్యక్తి కాదని.. కాలనాగు కంటే ప్రమాదకరమని రాహుల్ అన్నట్టు చెప్పుకొచ్చారు రేవంత్‌రెడ్డి. ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారన్నారు. తాము టీఆర్‌ఎస్‌తో కలిసిన వెంటనే బీజేపీకి రెండో స్థానంలోకి వచ్చేస్తుందని.. అలాంటి అవకాశం తామెందుకు ఇస్తామని ప్రశ్నించారాయన.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరిన మరుక్షణం నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటాడని... పార్టీ అధిష్ఠానం ఏం చెబితే అది చేయాల్సిందేనన్నారు. పార్టీ ఆదేశిస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రచారం చేయాల్సి వస్తుందన్నారు. వ్యూహకర్తగా ఉన్నా పీకే... ఆయా పార్టీలతో ఉన్న సంబంధాలు తెంచుకున్న తర్వాత కాంగ్రెస్‌లో చేరనున్నారన్నారు. కాంగ్రెస్ పెట్టిన మొదటి షరతు ఇదేనని వెల్లడించారు రేవంత్.
ప్రశాంత్ కిషోర్ పర్యటనపై మీడియా తప్పుడు ప్రసారం చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. టీఆర్‌ఎస్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడానికే పీకే వచ్చారని.. దాన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. టీఆర్‌ఎస్ ఇకపై ఐ ప్యాక్‌తోనే పని చేస్తుందన్నారు. పీకేతో ఉన్న డీల్ ఎలా రద్దు చేసుకోవాలో అన్న అంశంపై రెండు పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నట్టు పేర్కొన్నారు రేవంత్. కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ చూసి కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందన్నారు రేవంత్. అందుకే బండి సంజయ్‌తో పాదయాత్ర చేయిస్తున్నారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలం పుంజుకుందని... ఆ విషయం తెలిసిన తర్వాత బీజేపీని రంగంలోకి దించారని విమర్శించారు. బండి సంజయ్ పాదయాత్రకు కేసీఆర్ పైసలు అయితే ఇస్తున్నారని కానీ.. జనాలు మాత్రం రావడం లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చితే టీఆర్‌ఎస్‌కు లాభం చేకూరుతుందన్న కుట్రతోనే పాదయాత్ర నడుస్తోందన్నారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్ వల్ల ఏమీ జరగదన్నారు. దీన్ని చూపించి ఏదో గందరగోళం జరుగుందని మీడియా ప్రసారం చేయొద్దని రిక్వస్ట్ చేశారు రేవంత్ రెడ్డి.