HYDRA News: హైడ్రా మరింత బలోపేతం, మరో 169 మంది సిబ్బంది కేటాయింపు - ఇక తగ్గేదేలే
Hydra Demolitions | తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను మరింత పటిష్టం చేసేందుకు 169 మంది అధికారులను ఈ వ్యవస్థ కోసం కేటాయించింది. ఈ మేరకు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
HYDRA in Hyderabad | హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాలు, ఇతర జలాశయాల భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాను తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా 169 మంది అధికారులను హైడ్రా కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయిస్తూ బుధవారం నాడు (సెప్టెంబర్ 25న) ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఐదుగురు డీసీపీలు, నలుగురు అడిషనల్ కమిషనర్లు, 16 మంది సబ్ ఇన్‌స్పెక్టర్స్, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లతో పాటు 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను డిప్యూటేషన్‌పై హైడ్రాకు కేటాయించారు.
ఇదివరకే హైడ్రాపై అటు ప్రజల్లో, ఇటు ప్రతిపక్ష నేతల్లో అనుమానాలు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని తాజా నిర్ణయంతో స్పష్టమైంది. హైడ్రాను బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ ఏ నిర్ణయానికైనా వెనుకాడం లేదు. హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాలు, ఇతర ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. హైడ్రాకు కమిషనర్‌గా ఐపీఎస్ ఏవీ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం లేదని, వారికి ప్రస్తుతానికి నోటీసులు ఇస్తామని ఇటీవల స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కమర్షియల్ పర్పస్ కోసం కట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. వాటితో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అక్రమ కట్టడాలను సైతం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా సిబ్బంది నేలమట్టం చేస్తున్నారు.
Also Read: KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్