Ponnam Prabhakar: జీహెచ్ఎంసీలో ఇప్పటికే 10 లక్షల దరఖాస్తులు, త్వరలోనే స్కీమ్స్ అమలు: పొన్నం ప్రభాకర్
GHMC News: కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
![Ponnam Prabhakar: జీహెచ్ఎంసీలో ఇప్పటికే 10 లక్షల దరఖాస్తులు, త్వరలోనే స్కీమ్స్ అమలు: పొన్నం ప్రభాకర్ Telangana Minister Ponnam Prabhakar about implementation of Congress 6 Guarantees Ponnam Prabhakar: జీహెచ్ఎంసీలో ఇప్పటికే 10 లక్షల దరఖాస్తులు, త్వరలోనే స్కీమ్స్ అమలు: పొన్నం ప్రభాకర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/df4e702f29cdec46fa59e515218bdac91704286940212233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Congress 6 Guarantees: హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా అభయహస్తం కింద తమ హామీలను, పథకాలను వంద శాతం అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముషీరాబాద్ సర్కిల్ బోలక్ పూర్ వార్డులోని అంజుమన్ స్కూల్ లో బుధవారం నిర్వహించిన దరఖాస్తు స్వీకరణ కౌంటర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 10 లక్షల దరఖాస్తులు..
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 10 లక్షల దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. ఇందులో ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మి, సబ్సిడీ గ్యాస్ లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ గెలిచి నేటితో నెల రోజులు పూర్తయ్యాయని, ఈ సమయంలోనే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 45 గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చి ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకున్నారు అని చెప్పారు. ప్రతి ఇంటి నుండి ఒక దరఖాస్తును స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు ఇతర అంశాలు అయిన రేషన్ కార్డు, బస్తీ సమస్యల పై కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు అన్నారు.
అవసరమైతే మరిన్ని దరఖాస్తు కేంద్రాలు
జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులలో 600 కేంద్రాల్లో దరఖాస్తు స్వీకరణ కౌంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్థానికులకు అవసరం మేరకు మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముషీరాబాద్ సర్కిల్ బోలక్ పూర్ వార్డు పరిధిలో పద్మశాలి కాలనీ, డి.ఎస్.నగర్, ఎస్.బి.ఐ కాలనీ, దేవుని తోట వాంబాయి క్వార్టర్స్, మండి గల్లీ వరకు దరఖాస్తులు పూర్తి చేశారు. మిగిలిన పి అండ్ టి కాలనీ, సాయిబాబా నగర్ లలో 4, 5వ తేదీల్లో ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు.
ప్రజా పాలనలో ఎటువంటి సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి దరఖాస్తుదారుల తో మాట్లాడారు. మహిళలకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, హెల్ప్ డెస్క్ లు, త్రాగునీరు ఇతర సదుపాయాలను పరిశీలించారు. ముషీరాబాద్ సర్కిల్ లోని బోలక్ పూర్, రాంనగర్, అడిక్ మెట్, కవాడిగూడ, గాంధీ నగర్, ముషీరాబాద్ లో దరఖాస్తుల స్వీకరణ సజావుగా సాగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, స్పెషల్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి, ముషీరాబాద్ ఎమ్మార్వో లక్ష్మి, ఆర్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)