Ganesh Nimajjan 2024: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Ganesh Nimajjan in Hyderabad: ప్రతి సంవత్సరం తరహాలోనే ఈసారి కూడా హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధించాలని మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
Ganesh Immersion 2024 in Hyderabad Date: హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏటా తరహాలోనే ఈసారి కూడా హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధించాలని మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పిటిషన్‌పై మంగళవారం (సెప్టెంబరు 10) విచారణ జరిగింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పిటిషన్ విచారణ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు చేయవద్దని, నీరంతా కలుషితం అవుతోందని పిటిషనర్ వాదనలు వినిపించారు. నిమజ్జనాల విషయంలో గతేడాది హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఈసారి కొనసాగించాలని కోర్టును అభ్యర్థించారు. అంతేకాకుండా ప్రస్తుతం కీలకంగా ఉన్న ‘హైడ్రా’ను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలని విన్నవించారు. అయితే, పూర్తి వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ‘హైడ్రా’ను ప్రతివాదిగా చేర్చడానికి ఒప్పుకోలేదు. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషనర్ సరికాదని కోర్టు తప్పుబట్టింది. అలాగే ఆ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అయింది.
‘‘2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలి. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తాం. 2022 లో అధికారుల చర్యలపై తృప్తి చెంది రికార్డ్ చేసాం. పీవోపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేం. కానీ పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్ లో నిమజ్జనం చేసుకోవచ్చు. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్ వేయవచ్చు’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.
ఉదయం నుంచి ఫ్లెక్సీలు
హైకోర్టు తీర్పు రాకముందే ట్యాంక్ బండ్‌పై కనిపిస్తున్న ఫ్లెక్సీలు ఉదయం నుంచి కలకలం రేపాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో చేయడం కుదరదని హుస్సేన్ సార్ రెయిలింగ్ కి ఫ్లెక్సీలు తగిలించారు. ఈ ఫ్లెక్సీలు తెలంగాణ పోలీసులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏర్పాటు చేయించినట్లుగా అందులో ఉంది. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు కూడా భారీగానే ఏర్పాటు చేశారు. అక్కడికి క్రేన్లు, జేసీబీలు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన వారితో పాటు.. భక్తులు కూడా అయోమయానికి గురయ్యారు. తాజాగా హైకోర్టు నిమజ్జనాలకు అనుమతించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.