Telangana High Court: బ్రీత్ అనలైజర్ డేటాతో అలా చేస్తామంటే కుదరదు! తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు
Telangana High Court: బ్రీత్ అనలైజర్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీని ఆధారంగానే ఉద్యోగాలు తొలగించడం సరికాదని పేర్కొంది.

Telangana High Court: డ్రంకన్ డ్రైవ్‌ను అరికట్టేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్‌ను ప్రధానంగా వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని చాలా కంపెనీలు, సంస్థలు కూడా వాడుతున్నాయి. ఉద్యోగులు, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలు చేస్తుంటారు. అయితే దీనిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ఉద్యోగిని తీసేందుకు కేవలం ఈ పరీక్షలను ఆధారంగా చేసుకోవద్దని స్పష్టం చేసింది. తర్వాత పరీక్షలు నిర్వహించి ఉద్యోగం తీయడంపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
బ్రీత్ అనలైజర్ పరీక్షలు ఆర్టీసీలో కూడా చేస్తున్నారు. ఉద్యోగానికి వచ్చిన వెంటనే డ్రైవర్, కండక్టర్లకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న వారిని పక్కన పెడుతున్నారు. ఇలాంటి కేసులో ఏకంగా ఓ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. కేవలం బ్రీత్ అనలైజర్ పరీక్షతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని తేల్చి చెప్పింది. రక్త పరీక్షలు ఇతర పరీక్షలు నిర్వహించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
అసలేం జరిగింది
మదిరి డిపోకు చెందిన డ్రైవర్‌ను డిపో మేనేజర్ ఉద్యోగం నుంచి తొలగించారు. ఏప్రిల్ 25న తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. మద్యం సేవించి ఉద్యోగానికి వచ్చారని, అంతే కాకుండా స్థానికంగా జరిగిన ధర్నాలో కూడా పాల్గొన్నారనే కారణంతో ఈ చర్యలు తీసుకున్నారు. తన వాదన వినకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు మద్యం అలవాటు లేకపోయినా బ్రీత్ అనలైజర్‌్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని ఉద్యోగం నుంచి తీసేశారని పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును విచారించిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బ్రీత్ అనలైజర్ పరీక్షలు కేవలం ప్రాథమిక ఆధారమేనని స్పష్టం చేశారు. వీటి ఆధారంగానే ఉద్యోగం నుంచి తీసేంత చర్యలు సరికాదని పేర్కొన్నారు. రక్త, మూత్ర నమూన పరీక్షలు చేసిన తర్వాత నిర్దారించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ డిపో మేనేజర్ తీసుకున్న చర్యలు చట్టవిరుద్దమని తెలిపారు. అంతే కాకుండా ధర్నాలో చాలా మంది పాల్గొన్నప్పటికీ కేవలం ఒక వ్యక్తిపై తీసుకున్న చర్యలు కక్షపూరితంగా ఉన్నట్టు కనిపిస్తోందని కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. అందుకే డిపో మేనేజర్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది కోర్టు. తిరిగి డ్రైవర్‌ను ఉద్యోగంలో తీసుకోవాలని ఆదేశించింది.





















