Padma Awardees: పద్మ అవార్డుకు ఎంపికైనవారికి సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - భారీ నగదు, పెన్షన్ కూడా
Padma Vibhushan: పద్మ అవార్డుల్లో భాగంగా పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రభుత్వం సత్కరించింది.
Padma Awardees Felicitation: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఇందుకోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
పద్మ అవార్డుల్లో భాగంగా పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విఠలాచార్యను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సత్కరించారు.
రూ.25 లక్షల నగదు, పెన్షన్ కూడా
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. మన ప్రజా పాలనను అభినందించినట్లే. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తాం. దీంతోపాటు ప్రతి నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలి. ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.