Revanth Reddy: మూసీ నిర్వాసితులకు బిగ్ రిలీఫ్- గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Musi River Front Project: మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
Hyderabad News: తెలంగాణలో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. త్వరలో మూసీ(Musi) ప్రక్షాళణ కూడా మొదలు కాబోతున్న నేపథ్యంలో నిర్వాసితుల్ని ముందుగానే గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో నివాసం ఉంటున్న వారిని అక్కడినుంచి తరలించి ఆర్థిక సాయం అందిస్తారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్(Double Bed Room) ఇంటిని కూడా ఇస్తారు.
10,200 మంది గుర్తింపు..
అధికారంలోకి వచ్చాక మూసీ ప్రక్షాళణ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). లండన్ పర్యటనలో థేమ్స్ నదిని ఆయన పరిశీలించి వచ్చారు. అదే తరహాలో ఇక్కడ కూడా మూసీని ప్రక్షాళణ చేస్తామని చెప్పారు. నిధుల కేటాయింపుకి కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే అసలు సమస్య అంతా నిర్వాసితుల తరలింపుతోనే ముడిపడి ఉంది. మూసీనది చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది. మూసీ రివర్ బెడ్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో పేదలు నివాసం ఉంటున్నారు. వరదలు వచ్చినప్పుడు వారు తీవ్రంగా నష్టపోతారు. అయితే ప్రత్యామ్నాయం లేక తిరిగి అక్కడికే చేరుకుంటున్నారు. వారందర్నీ తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం హైడ్రా చర్యల వల్ల కూడా చాలామంది నష్టపోయారు, బాధితులతోపాటు ప్రతిపక్షం కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. మూసీ విషయంలో ఆ తప్పులు లేకుండా నిర్వాసితుల్ని ముందుగానే సంతృప్తి పరచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్వే చేపట్టింది. ఆ సర్వేలో 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. వారందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, హైదరాబాద్ మెట్రో రైలు సహా.. పలు ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మూసీ నిర్వాసితులకోసం 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ప్రాథమిక కసరత్తులు పూర్తి చేస్తాయి. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్తారు అధికారులు. వారికి ఎక్కడెక్కడ ఇళ్లను కేటాయించారో తెలియజేస్తారు. రివర్ బెడ్ లో ఉన్న ఆక్రమణలను ముందుగా తొలగించి బాధితుల్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలిస్తారు. ఇక మూసీ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఇక్కడ కొంతమందికి పట్టాలు కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఆ పట్టాభూమికి పరిహారం కూడా ఇస్తారు. మూసీ నిర్వాసితులకు చట్ట ప్రకారం పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం… pic.twitter.com/SOUw1hOIA7
— Telangana CMO (@TelanganaCMO) September 24, 2024
మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలను గుర్తించాలని.. వాటి ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయా ప్రాంతాల్లో ఆక్రమణల వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే చాలా చోట్ల ఆక్రమణల తొలగింపు జరిగిందని.. తిరిగి అక్కడ ఆక్రమణలు జరగకుంటా.. చెరువులు, నాలాలు ఆక్రమణకు గురి కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, ఆ ఫుటేజ్ ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు.
Also Read: 40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ