Hyderabad News: చీఫ్ అడ్వైజర్‌గా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ, సెక్రటేరియట్ 6వ ఫ్లోర్‌లో ప్రత్యేక ఛాంబర్
Hyderabad News: తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సీఎం కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా ఆయనను నియమించింది.

Hyderabad News: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన సలహాదారుడిగా రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ నేడు (మే 12) బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలోని ఆరో అంతస్తులో సోమేశ్ కుమార్‌కు ఓ ఛాంబర్ కూడా కేటాయించారు. ఆ ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. సచివాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి సోమేశ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవిలో సీఎస్ మూడేళ్లపాటు కొనసాగనున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయించినప్పటికీ.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యున్ల - క్యాట్ ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ హైకోర్టులో సవాల్ చేయడంతో హైకోర్టు సోమేశ్ కుమార్ ను ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 2023 ఫిబ్రవరిలో ఆయన ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు. ఆ వెంటనే హైదరాబాద్ కు వచ్చారు. ఏపీ సర్కారు కూడా సోమేశ్ కుమార్ కు ఎలాంటి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి, ఏపీలో అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి సోమేష్ కుమార్ ఇష్టపడలేదు. 2023 డిసెంబర్ వరకు ఆయనకు సర్వీస్ లో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పదవీ విరమణను ఏపీ సీఎం జగన్ ఆమోదించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక తొలి సీఎస్ గా పని చేసిన రాజీవ్ శర్మను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిలో కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నర్సింగరావు ఉన్నారు. ఇప్పుడు సోమేశ్ కుమార్ ను చీఫ్ అడ్వైజర్ గా నియమించడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిలోనే ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ పార్టీ కోసం సోమేశ్ కుమార్ పని చేయనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ గెలుపే లక్ష్యంగా సోమేశ్ కుమార్ పాలనాపరంగా పావులు కదుపుతారని రాజకీయ నాయకులు అంటున్నారు.





















