V Hanumantha Rao: నా టికెట్ జోలికొస్తే నీ బండారం బయటపెడతా: ఉత్తమ్ కు వీహెచ్ వార్నింగ్!
Telangana Elections 2023: నీకు, నీ భార్యకు మాత్రం సీట్లు కావాలి, నాకు మాత్రం వద్దా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు.
V Hanumantha Rao About Uttam Kumar Reddy:
హైదరాబాద్: నీకు, నీ భార్యకు మాత్రం సీట్లు కావాలి, నాకు మాత్రం వద్దా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (VH) ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పై మండిపడ్డారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అంబర్ పేటలోని తన నివాసంలో మాట్లాడుతూ ఘాటు విమర్శలు చేశారు. అంబర్ పేట సీటు తనదని, తనకు దక్కకుండా చేస్తే.. తాను కూడా ఉత్తమ్ వెంట పడుతానన్నారు. గతంలో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిని అయ్యానని, అంబర్ పేట్ అభివృద్ధి కోసం అనేక పనులు చేశానన్నారు. కానీ ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ ను లక్ష్మణ్ యాదవ్ అడుగుతున్నారని చెప్పారు. గతంలో ఇక్కడి నుంచి యాదవ్ లు గెలిచారని తెలిపారు. గత ఎన్నికల్లో కోదండరాం గట్టిగ పట్టు పట్టడం, అధిష్టానం కూడా చెప్పడంతో వెనక్కి తగ్గానని వీహెచ్ చెప్పారు.
‘ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నా అంబర్ పేట్ సీట్ వెంట పడ్డారు. ఈ సీటు కోసం ఇక్కడ నూతి శ్రీకాంత్ గౌడ్ ను ఉత్తమ్ ఎగదోస్తుండు. శ్రీకాంత్ అనే వ్యక్తి గతంలో నాపై sc, st అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టాడు. అలాంటి వ్యక్తి ని ఉత్తమ్ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. అదే సమయంలో నాపై దుష్ప్రచారం చేస్తుండు. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకొని వెనక్కి తగ్గారని చెప్పడం కరెక్ట్ కాదు. హనుమంతరావు డబ్బులు తీసుకునే వ్యక్తి కాదు. నిజంగానే నేను డబ్బులకు అమ్ముడుపొతే సగం హైదరాబాద్ నాదే ఉండేదని’ వీహెచ్ అన్నారు.
ఉత్తమ్ కు బీసీ ఓట్లు కావాలి కానీ బీసీ మీటింగ్ వద్దా అని ప్రశ్నించారు. సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెడుతా అంటే పెట్టనీయలేదు అని ఉత్తమ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ లో నుంచి బయటకు పంపేందుకు ఉత్తమ్ కుట్ర చేస్తున్నాడని వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. నేను ఎన్నటికీ పార్టీ మారనని, గాంధీ కుటుంబానికి విధేయుడినని స్పష్టం చేశారు. గతంలో ఉత్తమ్ తన మనుషులు మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని బయటకు పంపించారని, ఇప్పుడు జగ్గారెడ్డి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
జగ్గారెడ్డితో పీసీసీ అధ్యక్షుడవు అవుతావని రేవంత్ పై ప్రతిరోజు మీడియాలో మాట్లాడించింది ఉత్తమ్ అని వీహెచ్ చెప్పారు. పార్టీ మారుతున్నా అని ప్రచారం చేయించి, బ్లాక్ మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్న వ్యక్తి ఉత్తమ్ అన్నారు. స్క్రీనింగ్ కమిటీలో ఉండి పార్టీ నేతలపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేయడం ఆపకపోతే.. ఉత్తమ్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన పనులను బయట పెడతానంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే 55 మందితో తొలి జాబితాను విడుదల చేయడం తెలిసిందే. రెండో జాబితా కోసం ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశమయ్యారు. త్వరలోనే రెండో జాబితా ప్రకటిస్తామని మాణిక్ ఠాక్రే తెలిపారు.