Rajnath Singh: మాలో ఎవరిపైనా అవినీతి మచ్చలేదు, బీజేపీ వస్తే వారు జైలుకే - రాజ్ నాథ్ సింగ్
Telangana BJP News: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మేడ్చల్‌లో బీజేపీ సభకు హాజరయ్యారు. బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
Telangana Elections 2023: కీసర మండలం రాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బాగంగా బీజేపీ పార్టీ తలపెట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు. ఆయనతో పాటు మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు హాజరయ్యారు.
ఈ సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh in Hyderabad) మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేసి బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని తెలిపారు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. 27 సంవత్సరాలుగా గుజరాత్ ను దేశంలోనే ఒక మాడల్ గా అభివృద్ధి చేశామని, ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పారు.
అటల్ బిహారీ వాజపేయి నుండి, మోదీ వరకు బీజేపీ ప్రభుత్వాలు నాయకులపై ఏ ఒక్క అవినీతి మచ్చ లేదని అన్నారు. కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తానని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామని మోసం చేసి పేపర్ లీకేజీలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని ఏ ఒక్క దళితునికి ఇవ్వలేదన్నారు. 10 లక్షల దళితబంధు ఎవరికీ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ఉందని బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, తాను చేసిన సేవలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనన్నారు. మంత్రి మల్లారెడ్డి కబ్జాలకు అంతేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.