Purandeshwari: దళిత బంధులో అక్రమాలు, ఇది కేసీఆరే ఒప్పుకున్నారు - పురందేశ్వరి వ్యాఖ్యలు
Purandeshwari In Kukatpally: మంగళవారం (నవంబర్ 21) కూకట్‌పల్లిలో పురందేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది అవసరమని ప్రజలు భావిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. దళితబంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతుందని, ఈ విషయాన్ని కేసీఆరే ఒప్పుకున్నారని పురందేశ్వరి విమర్శించారు. తెలంగాణలో అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు పెద్ద హామీలు ఇచ్చారని, ఆ హామీ విషయం ఏమైందని ప్రశ్నించారు. మంగళవారం (నవంబర్ 21) కూకట్‌పల్లిలో పురందేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ మిత్రపార్టీ జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొని ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రేమ్ కుమార్‌ని గెలిపిస్తే నియోజక వర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల కోసం 9 లక్షల దరఖాస్తులు రాగా, కేవలం 50 వేల ఇళ్లు మాత్రమే నిర్మించారని గుర్తు చేశారు. ‘‘బీజేపీ, జనసేన పార్టీలు ప్రజాసమస్యలపై గొంతు విప్పి పోరాడే పార్టీలు. మా పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. బీఆర్ఎస్ మోస పూరిత వాగ్ధానాలతో రెండు సార్లు అధికారం లోకి వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఇప్పటికే అసహనంతో ఉన్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేదు. కేసీఆర్ పూర్తిగా మాట తప్పారు. ఒక్కసారి టీఎస్పీపీస్సీ నోటిఫికేషన్ ఇచ్చి లీకుల పేరుతో నాటకాలు ఆడారు. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బాగా ఇబ్బందులు పడుతున్నారు’’
‘‘పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయుల వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. దేశంలో 4 కోట్ల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. వాటిలో 3 కోట్ల ఇళ్లను నిర్మించింది. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కూడా కేసీఆర్ మాట తప్పారు. దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతుంది. ఆ అవినీతిని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు’’ అని పురందేశ్వరి మాట్లాడారు.