Telangana News: వైద్యులకు లైసెన్స్ పునరుద్ధరణ తిప్పలు - గంటలపాటు క్యూలోనే పడిగాపులు
Telangana News: హైదరాబాద్ కోటిలోని కౌన్సిల్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి వైద్యులు తమ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున క్యూలు కట్టారు.
Telangana News: తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్‌ఎంసీ) వైద్యులు తమ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవడానికి హైదరాబాద్ కోటిలోని కౌన్సిల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. అక్కడి క్యూలైన్లు చూస్తే రేషన్ దుకుణాలే గుర్తుకు వస్తాయి. రేషన్ షాపుల వద్ద జనాలు వేచి చూస్తున్నట్లు పెద్ద ఎత్తున వైద్యులు క్యూలో ఉన్నారు. జులై 20వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండడంతో వైద్యులంతా తమ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవడానికి వస్తున్నారు. లైన్ లో నిలబడి.. విపరీతమైన కాళ్ల నొప్పులు రావడంతో.. తమ లైసెన్సు పత్రాలను క్యూలో పెట్టి అవి కొట్టుకుపోకుండా పైన బండరాళ్లు పెట్టారు. ఇలా అందరూ తమ పత్రాలను లైన్ లో పెట్టుకొని పక్కకు వెళ్లి కూర్చున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో మారుమూల గ్రామాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులు తమ లైసెన్సుల రెన్యూవల్ కోసం హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు. పునరుద్ధరణ మరియు ధృవీకరణ లేకుండా వైద్యులు తదుపరి సీఎస్ఎంసీ ఎన్నికలలో పాల్గొనలేరు.
టీఎస్ఎంసీ కార్యాలయం వద్ద ఉదయం 7 గంటల నుంచే వైద్యులు క్యూలో నిల్చుంటున్నారు. కాసేపట్లోనే పనైపోతుంది వెళ్లిపోవచ్చు అనుకొని వచ్చిన వైద్యులు చాలాసేపు ఇక్కడే ఉండడంతో వారి ఆస్పత్రుల్లో ఉన్న రోగులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అక్కడున్న వైద్యుల్లో సగానికి పైగా ఎక్కువ సేపు వస్తున్నాం, వస్తున్నాం అంటూ ఫోన్ లో చెప్పడం గమనార్హం. "చాలా మంది రోగులు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. నేను బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఇక్కడి క్యూలైన్ లో నిలబడి ఉన్నాను. కానీ నా వంతు వచ్చేసరికి టోకెన్లు అయిపోయాయి. నేను గురువారం మళ్లీ కార్యాలయానికి వచ్చాను." అని సంగారెడ్డికి చెందిన ఈఎన్‌టి స్పెషలిస్ట్ డాక్టర్ పి సురేష్ కుమార్ చెప్పారు.
టీఎస్‌ఎంసీ కార్యాలయంలో 100 మంది కూర్చునే అవకాశం ఉంది. కానీ ప్రతిరోజూ 400 నుంచి 500 మంది వైద్యులు కార్యాలయానికి తరలి రావడంతో అది అస్తవ్యస్తంగా మారింది."నేను క్యూలో ఉన్నాను. కానీ విపరీతమైన రద్దీ ఉండడంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యాలయం చిన్నగా ఉండడంతో నిలబడడానికి కూడా చాలా కష్టంగా ఉంటోంది. అని నిర్మల్ జిల్లాకు చెందిన డాక్టర్ సాహిల్ షేక్ అన్నారు. అధికారులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు మొగ్గు చూపాలని ఆయన కోరారు.
ప్రతిరోజూ 100 టోకెన్లు మాత్రమే జారీ చేయడంతో ఇప్పటివరకు సుమారు 1,000 మంది వైద్యులు తమ లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకోగలిగారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది వైద్యులు తమ లైసెన్సులను జూలై 20 గడువు కంటే ముందే రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది. ఆన్‌లైన్ సిస్టమ్ సిద్ధంగా లేనప్పటికీ వైద్యులు వారి వివరాలను పునరుద్ధరించుకోవడాని, ధృవీకరించుకోవడానికి మూడు ఎంపికలను అందించినట్లు టీఎస్ఎంసీ అధికారులు తెలిపారు. వాట్సాప్‌తో పాటు, వైద్యులు పోస్ట్ ద్వారా పత్రాలను పంపవచ్చని.. అలాగే వివరాలను తనిఖీ చేయడానికి, నవీకరించడానికి ప్రత్యేక మొబైల్ నంబర్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతీ ఏడాది తమకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రెన్యూవల్స్(రిజిస్ట్రేషన్ ఐదేళ్లు పూర్తయిన తర్వాత) మాత్రమే వచ్చేవని.. కాకపోతే టీఎస్ఎంసీ ఎన్నికలకు ముందు కొన్ని వైదయ సంఘాలు మరికొంత మంది వైద్యులను ముందుకు తేవడంతో వీరి సంఖ్య పెరిగిందని వివరించారు. పునరుద్ధరణకు ఇతర పద్ధతులను ఉపయోగించమని టీఎస్ఎంసీ చైర్మన్ డాక్టర్ V రాజలింగం అధికారులను ఆదేశించారు. అయితే మరికొద్ది రోజుల్లో వైద్యుల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ సిద్ధమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.