Telangana Covid Cases: తెలంగాణలో మరింత పెరిగిన కరోనా, 3 వేలు దాటిన యాక్టివ్ కేసులు - 500కి చేరువలో కొత్తవి
Telangana Covid: ఒక్క హైదరాబాద్ లోనే 341 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కొత్త కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. తాజాగా యాక్టివ్ కేసులు 3 వేలు దాటాయి. గత 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 496 మందికి కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీటిలో ఒక్క హైదరాబాద్ లోనే 341 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 15 కేసులను గుర్తించారు. జూన్ ఒకటో తేదీన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.61 శాతం ఉండగా 24వ తేదీ నాటికి 1.69 శాతానికి పెరిగిందని ప్రజారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
రాష్ట్రంలో రికవరీ రేటు 99.03 శాతంగా ఉండగా మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ మరణాలు నమోదు కాకపోవడం ఊరట ఇస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకూ 4,111 మంది కోవిడ్ కారణంగా మరణించారు.
‘‘తెలంగాణలో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశం లేదు, కొత్త వేరియంట్ వస్తేనే కేసులు పెరుగుతాయి, మరో 6 వారాలపాటు కరోనా కేసులు పెరగొచ్చు, రోజుకు 3 వేల కేసులు నమోదయ్యే అవకాశం, పండుగలు, ఫంక్షన్లలో మాస్క్ తప్పనిసరి’’ అని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
తెలంగాణలో కరోనా పరిస్థితుల గురించి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోజుకు 3 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. పండగలు, ఫంక్షన్లలో పాల్గొనేవారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు ఉన్నాయని వెల్లడించారు. అందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు పాటిస్తూ, వైరస్ సంక్రమించకుండా చూసుకోవాలని చెప్పారు. అర్హులకు ప్రికాషన్ వ్యాక్సిన్ డోస్ లు కూడా ఇస్తున్నట్టుగా వెల్లడించారు.