Telangana: బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదాం- తరిమికొడదాం! ఏపీ తరహాలో గడప గడపకు కాంగ్రెస్
TPCC Chief Revanth Reddy: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై శనివారం ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీపీసీసీ ప్రారంభించిన కార్యక్రమం తిరగబడదాం- తరిమికొడదాం.

- తిరగబడదాం- తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం
- కేసీఆర్ ను శిక్షించేందుకే ప్రజాకోర్టులో ప్రజా ఛార్జ్ షీట్ లు
- తెలంగాణలో భూతద్దం పెట్టినా సామాజిక న్యాయం కనిపించడం లేదు
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
TPCC Chief Revanth Reddy: రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలకు విలువ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై శనివారం ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీపీసీసీ ప్రారంభించిన కార్యక్రమం తిరగబడదాం- తరిమికొడదాం. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవనున్నాయి. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఇదివరకే గడప గడప కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
ఈ ప్రజా కోర్టు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి, ఉద్యమకారుల ఆత్మబలిదానాలు గౌరవించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘తెలంగాణ సాధనకు ముఖ్య కారణాలు నీళ్లు, నిధులు, నియామకాలు అని గతంలో కేసీఆర్ చెప్పిండు. తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. ప్రజల హక్కులను కాలరాస్తున్నాడు. రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై సీఎం కేసీఆర్ దాడులకు పాల్పడుతున్నాడు’ అని కేసీఆర్ సర్కార్ పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
కేసీఆర్ ను శిక్షించేందుకే ఇక్కడ ప్రజాకోర్టులో ప్రజా ఛార్జ్ షీట్ లు పెడుతున్నామన్నారు. ఈ ప్రజాకోర్టులో ప్రొఫెసర్ కంచె ఐలయ్య తీర్పు చెబుతారు. సామాజిక న్యాయం తెలంగాణలో భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే ఈ ప్రజా కోర్టును ఏర్పాటు చేశామన్నారు. గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతాం..తిరగబడదాం.. తరిమికొడదాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
గద్దర్ కు నివాళి
ఇటీవల అమరుడైన ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు నివాళిగా ప్రజాకోర్టు వేదికపై కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
తిరగబడదాం- తరిమి కొడదాం కార్యక్రమం ఇలా
తెలంగాణ కాంగ్రెస్ తీసుకొచ్చిన ‘తిరగబడదాం- తరిమికొడదాం’ ప్రచారంలో భాగంగా నెల రోజుల పాటు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ వైఫల్యాలపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా 12,000 గ్రామాల్లో , 3,000 డివిజన్ స్థాయిలలోకాంగ్రెస్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. సీఎం కేసీఆర్, అధికార పార్టీ బీఆర్ఎస్ వైఫల్యాలపై ప్రజా కోర్టు నిర్వహించనున్నారు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నాయకులు చార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవనున్నాయి. ఈ ప్రచారంలో మిస్డ్ కాల్ తో భాగమయ్యేలా కాంగ్రెస్ పార్టీ 7661 899 899 ఫోన్ నంబర్ తో కూడా ప్రోగ్రాంను రూపొందించింది. వీటితో పాటు ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫ్యలాలను ఎండగట్టేందుకు పోస్ట్ కార్డుల కార్యక్రమాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ చేపట్టనుంది.





















