Revanth Reddy: అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy in Hyderabad: హైదరాబాద్ మారథాన్-2024లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు.
Telugu News: 2036లో ఇండియాలో ఒలింపిక్స్ను నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని.. అలాంటి ఒలింపిక్స్ క్రీడలకు హైదరాబాద్ వేదిక చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ మారథాన్-24లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. క్రీడా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
‘‘క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ వేదికగా మాట ఇస్తున్నా. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం. ఒలంపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్ లో ప్రారంభించబోతున్నాం. అంతర్జాతీయ స్ధాయి కోచ్ లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తాం.
ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపాం. దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం. స్పోర్ట్స్ విలేజ్ను మళ్లీ క్రీడాకార్యక్రమాలకు వినియోగిస్తాం.. 2028 ఒలింపిక్స్లో ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ మెడల్స్ వచ్చేలా ప్రోత్సహిస్తాం. 2036లో ఇండియాలో ఒలింపిక్స్ను నిర్వహించాలని మోదీ ప్రయత్నిస్తున్నారు.. ఒలింపిక్స్ క్రీడలకు హైదరాబాద్ వేదిక చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.