Revanth Reddy: దేవుడు గొప్ప డిజైనర్, ప్రకృతి ఉత్తమ గురువు.. మనం మంచి విద్యార్థులమా ? సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Asia Pacific Bio design Innovation Summit 2025 | బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025 సదస్సులో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

AIG Hospitals | హైదరాబాద్: ఏ ఆవిష్కరణ అయినా దాని ప్రయోజనం, పనితీరు, రూపం అనే మూడు అంశాలపై ఆధారపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. “దేవుడు గొప్ప డిజైనర్, ప్రకృతి ఉత్తమ గురువు. మనం మంచి విద్యార్థులమా కాదా అన్నదే అసలు ప్రశ్న” అని సీఎం అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ వేదికగా జరిగిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణలపై జరుగుతున్న ఈ సదస్సులో మాట్లాడుతూ బయోడిజైన్ ప్రాధాన్యతను వివరించారు. లైఫ్ సైన్సెస్‌లోనూ, వైద్యంలోనూ ప్రకృతి నుంచి నేర్చుకోవడం వల్ల తప్పులు చేయకుండా ముందుకు సాగవచ్చని సూచించారు.
లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా తెలంగాణ
కృత్రిమ మేధస్సు (Artificial intelligence) బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ అని, మానవుల మెదడును ఆధారంగా చేసుకొని కృత్రిమ మేధస్సును సృష్టించారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న “తెలంగాణ రైజింగ్ 2047” ప్రస్థానాన్ని ఆయన ప్రస్తావించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా నిలుస్తుందని, ఈ ప్రయాణంలో మెడ్‌టెక్, వైద్య పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, మెడ్‌టెక్ రంగాలు అత్యంత ప్రాధాన్యం కలవని సీఎం గుర్తు చేశారు. తయారీ రంగం నుంచి ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని అన్నారు.

సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్‌ను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. పరిశోధన, పరీక్షలు, తయారీకి అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 60కి పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.
మన దేశం కోసం మన మేధస్సు ఉపయోగించాలి
స్థానిక స్టార్టప్‌లు, MSMEలు గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయని తెలంగాణ సీఎం వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం పరిశోధనలు చేస్తున్న డాక్టర్ నాగేశ్వర రెడ్డి, AIG హాస్పిటల్‌ను రేవంత్ రెడ్డి అభినందించారు. ఇంతకాలం మన మేధస్సు ఇతర దేశాల ప్రజల కోసం ఉపయోగించాం. ఇకపై మన ప్రజల మేలు కోసం ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
డేటా గోప్యతను కాపాడుతూ, ప్రజల వైద్య సహాయం కోసం అవసరమైన డేటాను అందజేస్తామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ, కార్పొరేషన్లు, విద్యాసంస్థలు, రీసెర్చ్ సెంటర్లతో అనుసంధానం చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పన్నులు, యుద్ధాలు, వాణిజ్య అడ్డంకులు వంటి అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఈ సమయంలో ఆవిష్కరణలకు తెలంగాణే సరైన వేదిక అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవాళిని మరింత ఆరోగ్యంగా మార్చడానికి మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.






















